స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు-2026, పండుగలా నిర్వహణకు టీడీపీ భారీ ప్లాన్
TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం 'మహానాడు-2026' కు ముహూర్తం ఖరారైంది.
స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు-2026, పండుగలా నిర్వహణకు టీడీపీ భారీ ప్లాన్
TDP Mahanadu: తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహానాడు-2026 ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు రానుంది. మహిళా సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని "స్త్రీ శక్తి" థీమ్‌తో మహానాడు నిర్వహించేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ భవిష్యత్ దిశ, ప్రభుత్వ పనితీరు, రాజకీయ వ్యూహాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిపై చర్చించేలా ఈసారి మహానాడు వేదిక సిద్ధమవుతోంది..
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై విస్తృత చర్చ జరిగింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో మహానాడును ఎలా మరింత ప్రభావవంతంగా నిర్వహించాలన్న అంశాలపై చర్చించారు..
ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వీటిలో 10 తీర్మానాలు ఆంధ్రప్రదేశ్‌కు, 4 తెలంగాణకు, ఒకటి అండమాన్‌కు సంబంధించినవి. మరో నాలుగు ఉమ్మడి తీర్మానాలతో పాటు చివరగా కీలక రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ తీర్మానాలు భవిష్యత్ రాజకీయ దిశను సూచించేలా ఉండనున్నాయి..
ఈసారి మహానాడులో ప్రధాన ఆకర్షణగా "స్త్రీ శక్తి" నిలవనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల అభివృద్ధి, మహిళా సాధికారత కోసం తీసుకున్న చర్యలు, మహిళలకు కల్పించిన అవకాశాలు, పథకాలు, హక్కులపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ప్రతి ప్రభుత్వ పథకంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే విధానాలను కూడా ప్రజలకు వివరించనున్నారు..
రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాలు, అమలవుతున్న కార్యక్రమాలపై సమగ్ర చర్చ జరగాలని సీఎం సూచించారు. అలాగే "మన దేశం-మన బాధ్యత" పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పొదుపు చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించే వేదికగా మహానాడు మారనుంది..
అంతేకాదు, పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, ముఖ్యంగా నందమూరి రామారావు ఆలోచనలను కొత్త తరానికి పరిచయం చేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షాలపై విమర్శలు, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలు కూడా ఇందులో చోటు చేసుకోనున్నాయి..
ఈసారి మహానాడు హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నప్పటికీ మహానాడు స్పూర్తి ఏమాత్రం తగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు. రెండు రోజుల ముందుగానే ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరేయాలని, గ్రామ స్థాయి కార్యకర్త నుంచి పార్టీ అగ్రనాయకత్వం వరకు అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ మహానాడును ప్రారంభించాలని నిర్ణయించారు.
మహిళా సాధికారత, అభివృద్ధి, రాజకీయ వ్యూహాలు, పార్టీ సిద్ధాంతాలు అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా మహానాడు-2026 రూపుదిద్దుకుంటోంది. "స్త్రీ శక్తి" థీమ్‌తో ఈసారి మహానాడు పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకొస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.




