53 రోజుల నిర్బంధం.. కోట్లాది హృదయాల మద్దతు మరువలేను...కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

Amaravati: రాజమండ్రి జైలు విడుదల సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం చంద్రబాబు భావోద్వేగ ఎక్స్ పోస్ట్. తనకు అండగా నిలిచిన కోట్లాది మంది ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 31 Oct 2026 11:22 PM IST
Amaravati
X

53 రోజుల నిర్బంధం.. కోట్లాది హృదయాల మద్దతు మరువలేను...కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

అమరావతి: 53 రోజుల నిర్బంధం.. ఎన్నో రాజకీయ పరిణామాలు.. దేశవిదేశాల్లో తెలుగువారి సంఘీభావం.. తనకు అండగా నిలిచిన కోట్లాది మంది ప్రజల మద్దతు.. ఇవన్నీ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

నాడు తనను అక్రమంగా నిర్బంధించి ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నించారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగుతున్న విధ్వంస పాలనను ప్రశ్నిస్తున్నందుకే తనపై చర్యలకు దిగారని ఆరోపించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో అర్ధరాత్రి అరెస్టు చేశారని గుర్తుచేసుకున్నారు. ఆ అరెస్టు వెనుక కుట్ర ఉందని ప్రజలకు అర్థమైందని తెలిపారు. తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు అత్యంత కఠినమైనవని పేర్కొన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తిరిగి ప్రజల్లోకి వచ్చానని వివరించారు.

నిర్బంధంతో ఒంటరిని చేయాలనుకుంటే.. ప్రజలు అండగా నిలిచారు!

తాను జైలులో ఉన్న సమయంలో కోట్లాది మంది తెలుగు ప్రజలు చూపిన ఆదరణ, మద్దతు జీవితాంతం గుర్తుండిపోతాయని చంద్రబాబు అన్నారు. తనను ఒంటరిని చేయాలనుకున్న ప్రయత్నాలు యావత్ తెలుగుజాతి స్పందనతో విఫలమయ్యాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే సంకల్పంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు. నాటి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో యువత సంఘీభావం ప్రత్యేకం

తనకు మద్దతుగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 'సీబీఎన్ గ్రాటిట్యూడ్' కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిర్బంధాలు ఉన్నప్పటికీ వేలాది మంది యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ తరలివచ్చి తనకు సంఘీభావం తెలిపిన ఘటన జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. తాను ప్రవేశపెట్టిన సంస్కరణలు, కల్పించిన అవకాశాల ద్వారా మంచి ఉద్యోగాలు పొందిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలపడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.

గ్రామాల్లోని సామాన్య మహిళల నుంచి అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల సీఈవోల వరకు, రైతుల నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకు, విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు సమాజంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని చంద్రబాబు వివరించారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన సతీమణి, కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అంటూ ప్రజల్లోకి వచ్చినప్పుడు వారికి అండగా నిలిచారని తెలిపారు. ప్రజలు చూపిన ఐక్యత, ధైర్యం తనకు ఎంతో బలాన్నిచ్చాయని పేర్కొన్నారు.

మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మీ భవిష్యత్తే నా సంకల్పం

తనకు అండగా నిలిచిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానులకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన వారందరికీ చంద్రబాబు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, అభిమానాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. తన కోసం నిలిచిన ప్రజల కోసం చివరి వరకు నిలబడతానని స్పష్టం చేశారు.

ప్రజల నమ్మకం, అభిమానం తన బలమని, వారి భవిష్యత్తే తన సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెడతానని పునరుద్ఘాటించారు. గతంలో ఎదుర్కొన్న కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ, తనకు అండగా నిలిచిన ప్రజల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడంతో పాటు భవిష్యత్తు లక్ష్యాన్ని మరోసారి ప్రజల ముందుంచారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.