Amaravati: చిలకలూరిపేట ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!
Amaravati: చిలకలూరిపేట ఘోర ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు సానుభూతి, గుంటూరు GGHలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం.
Amaravati: చిలకలూరిపేట ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!
Amaravati: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఆటోను ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.. మృతుల కుటుంబాల పరిస్థితిపై ఆరా తీశారు. ఒక్కసారిగా జరిగిన ఈ విషాద ఘటన పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, ఇతర చికిత్సా ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని సూచించారు.
అలాగే గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చికిత్సకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఒక్కసారిగా జరిగిన ఈ విషాదంతో వేలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.




