Amaravati: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ!

Amaravati: ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ. పోలవరం ప్రాజెక్టు పనులు, జల్ జీవన్ మిషన్ నిధుల విడుదలపై చర్చ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 8 Oct 2026 12:09 PM IST
Amaravati
X

Amaravati: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ!

Amaravati: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనులకు నిధుల విడుదల, ఒడిశా–ఛత్తీస్‌గఢ్‌తో పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రిని కలిసిన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటిపారుదల, తాగునీటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో పనులు వేగంగా సాగుతున్నాయని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పోలవరం నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాసం, పునరావాస ప్యాకేజీ పనులకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన ప్రొటెక్టివ్ ఎంబాంక్‌మెంట్ల పనులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉంది. ఈ కారణంగా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం అబెయన్స్‌లో ఉన్నప్పటికీ.. దాన్ని శాశ్వతంగా ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. అలాగే రెండు రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు. మూడు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర సహకారం, సమన్వయంతో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

పోలవరం వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పునరావాస, ఆర్అండ్ఆర్ పనులను ప్రభుత్వం వేగంగా చేపడుతోందని సీఎం తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 45.72 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు, చేపట్టాల్సిన పనులపై కూడా కేంద్ర మంత్రితో చర్చించారు.

గోదావరి నుంచి వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేలా పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్న విషయాన్ని వివరించారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి, దేశానికి కలిగే ప్రయోజనాలను కూడా కేంద్ర మంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టును భవిష్యత్తులో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు.

ఇదే సమయంలో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనులపైనా సీఎం వివరాలు వెల్లడించారు. ఇటీవల ప్రొద్దుటూరులో పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 95 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉండగా.. ఇప్పటికే 62 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. తాజాగా మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు కల్పించే పనులకు శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ పనులకు అనుగుణంగా సత్వరమే నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

పోలవరం, జల్ జీవన్ మిషన్ పనులకు నిధుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగిన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.