AP: చంద్రబాబు–పవన్ భేటీ.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చ!
AP: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల వేళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు ఉదయం భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.
AP: చంద్రబాబు–పవన్ భేటీ.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చ!
AP: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రేపు ఉదయం 9.30 గంటలకు సీఎం చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ రానున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురు నేతల సమావేశం జరగనుంది.
ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి..? ఏ ప్రాంతాల్లో ఏ పార్టీకి బలం ఉంది..? స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలి..? అనే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానిక స్థాయిలో ఎన్నికల సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో.. పోటీపై స్పష్టత తీసుకురావడం కీలకంగా మారింది.
మేయర్, చైర్‌పర్సన్ స్థానాల విషయంలోనూ కూటమి పార్టీల మధ్య అవగాహనపై చర్చ జరిగే అవకాశం ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానిక బలాబలాలను పరిగణనలోకి తీసుకుని పదవుల పంపకం ఎలా ఉండాలన్న అంశంపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ లేదా మంత్రి సత్యకుమార్ పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారన్న దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమన్వయంతో ముందుకు వెళ్లడం కూటమికి కీలకంగా మారింది. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య పోటీకి అవకాశం లేకుండా ముందుగానే సీట్ల సర్దుబాటు, స్థానిక నాయకత్వం అంశాలపై ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సమావేశం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి వ్యూహం, సీట్ల సర్దుబాటు, మేయర్–చైర్‌పర్సన్ స్థానాల విషయంలో కీలక స్పష్టత వచ్చే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.




