Amaravati: ఎండల తీవ్రతపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష
Amaravati: ఏపీలో భానుడి భగభగలు. ఎండల తీవ్రతపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష. అవసరమైతే స్థానికంగా సెలవులు.. 1349 హీట్ షెల్టర్ల ఏర్పాటుకు ఆదేశం.
Amaravati: ఎండల తీవ్రతపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష
Amaravati: రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను రక్షించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*ఎండ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు*
తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులు, వృద్ధులు, ప్రజల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి హీట్ వేవ్ తీవ్రత గణనీయంగా పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు.
*ప్రజలకు చల్లని నీరు.. మజ్జిగ.. ఓఆర్ఎస్ అందుబాటులో*
ఎండల ప్రభావం తగ్గించేందుకు ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ కూడళ్లు వంటి ప్రాంతాల్లో తాత్కాలిక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు.
*ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు జాగ్రత్త*
వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడేవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రాకుండా ఉండాలని సీఎం సూచించారు. అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
*రాష్ట్రవ్యాప్తంగా హీట్ షెల్టర్ల ఏర్పాటు*
ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1349 హీట్ షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులకు నీడ కల్పించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
*మూగ జీవాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ*
ఎండ తీవ్రత మనుషులకే కాదు, మూగ జీవులు, పక్షులకు కూడా ఇబ్బందిగా మారుతోందని సీఎం గుర్తు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీరు ఏర్పాటు చేయాలని సూచించారు. పక్షులు, జంతువుల సంరక్షణ కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
*తాగునీటి సమస్య రాకుండా చర్యలు*
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
*పచ్చదనం పెరిగితే.. ఉష్ణోగ్రత తగ్గే అవకాశం*
పర్యావరణ పరిరక్షణపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. భూగర్భ జలాలు పెరిగితే పచ్చదనం కూడా పెరుగుతుందని, దాని వల్ల తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు.
*వచ్చే వారం రోజులపాటు ప్రత్యేక కార్యాచరణ*
వచ్చే వారం రోజుల పాటు ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. హెచ్చరికలు, సూచనలు ప్రజలకు నిరంతరం చేరేలా మీడియా, సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ప్రజల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మరోసారి స్పష్టం చేశారు.




