Amaravati: పెట్రోల్, డీజిల్ సరఫరాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక పర్యవేక్షణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ.
Amaravati: పెట్రోల్, డీజిల్ సరఫరాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక పర్యవేక్షణ!
Amaravati: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత పరిస్థితిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొనేంత వరకు ఎవరూ విశ్రమించవద్దని, ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం సూచించారు..
*విశాఖ వెళ్లే ముందు మరోసారి సమీక్ష*..
విశాఖకు బయలుదేరే ముందు సీఎం మరోసారి పెట్రోల్, డీజిల్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను ఆదేశించారు..
*ఆయిల్ కంపెనీలతో వరుస సమావేశాలు*..
ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థల ప్రతినిధులతో అధికారులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి అవసరమైన ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు సమన్వయం పెంచారు. ప్రతి జిల్లాలో బంకుల పరిస్థితిని సమీక్షిస్తూ తక్షణ చర్యలు చేపడుతున్నారు..
*2679 లోడ్ల డిస్పాచ్‌కు ప్రణాళిక*..
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2679 లోడ్లను వివిధ పెట్రోల్ బంకులకు పంపాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వాటిలో ఇప్పటికే 2079 లోడ్లు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 600 లోడ్లను కూడా త్వరితగతిన పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
*పెరిగిన పెట్రోల్–డీజిల్ సరఫరా*
ఇప్పటికే చేరిన లోడ్ల ద్వారా 11,909 కిలో లీటర్ల పెట్రోల్, 19,707 కిలో లీటర్ల డీజిల్ సరఫరా జరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ సరఫరా మెరుగైందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వస్తోందన్నారు.
*ప్రతి లోడ్‌కు ప్రత్యేక భద్రత*
ప్రతి లోడ్‌కు రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అటాచ్ చేసి పంపిస్తున్నారు. డిస్పాచ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాలకు చేరడంలో కొంత ఆలస్యం జరుగుతున్నా, సరఫరా ఆగకుండా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
*పలు జిల్లాల్లో పరిస్థితి మెరుగుదల*
అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం, మార్కాపురం జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత ఉదయంతో పోలిస్తే మెరుగైందని అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో కూడా లోడ్ డిస్పాచ్ కొనసాగించాలని సీఎం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు...
*భారీ అమ్మకాలు నమోదు*..
రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 గంటల సమయానికి 6511 కిలో లీటర్ల పెట్రోల్, 9046 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు నమోదయ్యాయి. సాధారణ పరిస్థితులు పూర్తిగా పునరుద్ధరించే వరకు ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.




