Amaravati: అమరావతిలో పాన్-ఐఐటీ వరల్డ్ కౌన్సిల్: సీఎం చంద్రబాబు!
Amaravati: అమరావతిలో పాన్-ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏపీలో 50 లక్షల ఏఐ నిపుణుల తయారీ, క్వాంటం కంప్యూటింగ్ ఆపరేషన్స్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.
Amaravati: అమరావతిలో పాన్-ఐఐటీ వరల్డ్ కౌన్సిల్: సీఎం చంద్రబాబు!
అమరావతి: పాన్-ఐఐటీ ఏపీ–2026 సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఆలోచనలు, అవకాశాలకు వేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని 23 ఐఐటీల నుంచి ఇప్పటివరకు సుమారు 5 లక్షల మంది ఐఐటీయన్లు బయటకు వచ్చారని, వారి నైపుణ్యం, ఆలోచనలను రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటే ఏపీ అభివృద్ధి మరో స్థాయికి చేరుతుందని చెప్పారు.
పాన్-ఐఐటీ ఏపీ–2026 సదస్సులో వివిధ రంగాల్లో నిపుణులైన వారితో కీలక అంశాలపై చర్చించామని సీఎం తెలిపారు. టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధిపై సమాలోచనలు జరిగాయని చెప్పారు.
అమరావతిలో పాన్-ఐఐటీ వరల్డ్ కౌన్సిల్
అమరావతిలో పాన్-ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు కానుందని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అకాడమిక్, టెక్నాలజీ నిపుణులను అనుసంధానం చేసే అతిపెద్ద నెట్‌వర్క్‌గా ఇది ఉపయోగపడుతుందని అన్నారు. 23 ఐఐటీల నుంచి పెద్ద సంఖ్యలో ఐఐటీయన్లు అమరావతికి రావడం రాష్ట్రానికి ఉన్న బ్రాండ్‌కు నిదర్శనమని చెప్పారు.
పాన్-ఐఐటీ కౌన్సిల్ సహకారంతో రాష్ట్రంలోని విద్యా విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడంతో పాటు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కరిక్యులమ్‌ను రూపొందించేందుకు మార్గదర్శకత్వం పొందుతామని తెలిపారు.
100 మంది స్టార్టప్ మెంటర్ల తయారీ
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని సీఎం చెప్పారు. ఇందులో భాగంగా 100 మంది స్టార్టప్ మెంటర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక ఆలోచనా విధానాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి భవిష్యత్‌లో ఉద్యోగాలు సృష్టించే స్థాయికి వారిని తీసుకెళ్లేందుకు పాన్-ఐఐటీ కౌన్సిల్ సహకారం తీసుకుంటామని చెప్పారు.
క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి
క్వాంటం కంప్యూటింగ్ రంగంలోనూ ఏపీ ముందడుగు వేస్తోందని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రస్తుతం ‘క్యూ శివ’ పేరుతో క్వాంటం కంప్యూటర్లను తయారు చేశారని, అతి తక్కువ ధరతో క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.
రాబోయే రెండేళ్లలో కమర్షియల్ క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేస్తామని క్వాంటం సంస్థలు చెబుతున్నాయని సీఎం వెల్లడించారు.
యూజర్లుగా కాకుండా ప్రొడ్యూసర్లుగా ఎదగాలి
భారత్, ఆంధ్రప్రదేశ్ కేవలం టెక్నాలజీని వినియోగించే స్థాయిలోనే కాకుండా.. సాంకేతికతను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలని చంద్రబాబు అన్నారు. అందుకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టామని తెలిపారు.
50 లక్షల ఏఐ నిపుణుల తయారీ లక్ష్యం
జాతీయ స్థాయిలో కోటి మంది ఏఐ నిపుణులను సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 50 లక్షల మంది ఏఐ నిపుణులను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుందని చెప్పారు.
డీప్ టెక్ పాలసీకి పాన్-ఐఐటీ కౌన్సిల్ సలహాలు, సూచనలు అందిస్తుందని తెలిపారు. మంచి ఆలోచనను సమర్థంగా అమలు చేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని చంద్రబాబు అన్నారు.
రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్
రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్న ఆలోచనతో అనేక ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. ఇందులో భాగంగానే రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు.
పూర్వోదయ పథకం ద్వారా గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు నిధులు అందుతున్నాయని తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు, నిర్వహణకు రిలయన్స్ సంస్థ సహకరించేందుకు ముందుకు వచ్చిందని చంద్రబాబు వెల్లడించారు.
విద్యా సంస్థలకు కేంద్రంగా ఏపీ
ప్రభుత్వ రంగంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలతో పాటు.. ప్రైవేట్ రంగంలోని ప్రముఖ విద్యా సంస్థలు కూడా ఏపీకి వచ్చాయని చంద్రబాబు తెలిపారు. విద్య, పరిశోధన, టెక్నాలజీ, పరిశ్రమలు, స్టార్టప్‌లను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ఐఐటీయన్ల నైపుణ్యం, పరిశ్రమల సహకారం, విద్యా సంస్థల సామర్థ్యం, ప్రభుత్వ విధానాలను సమన్వయం చేస్తే రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని సీఎం పేర్కొన్నారు.




