Amaravati: విద్యుత్ చార్జీల తగ్గింపుపై సీఎం చంద్రబాబు క్లారిటీ
Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు.
Amaravati: విద్యుత్ చార్జీల తగ్గింపుపై సీఎం చంద్రబాబు క్లారిటీ
Amaravati: ప్రజలకు తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను ఈ ఏడాది చివరి నాటికి యూనిట్‌కు రూ.4.60కు తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో వేసవి విద్యుత్ సరఫరా, పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
*వేసవిలో భారీగా విద్యుత్ డిమాండ్*
రోజుకు 285 మిలియన్ యూనిట్ల వరకు అవసరం వేసవి కాలంలో రాష్ట్రంలో ప్రతి రోజూ 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకు 6397 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించుకున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 14 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. వేసవితో పాటు పారిశ్రామిక వినియోగం పెరగడం కూడా ఇందుకు ప్రధాన కారణమని వివరించారు.
*విద్యుత్ కొనుగోలు ధర తగ్గింపు*
రూ.5.20 నుంచి రూ.4.90కు తగ్గిన ధర విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఏప్రిల్ 2025లో యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.20గా ఉండగా, మార్చి 2026 నాటికి దానిని రూ.4.90కు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ ధరను మరింత తగ్గించి రూ.4.60కు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం స్పష్టం చేశారు.
*పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి*
2028-29 నాటికి సగానికి పైగా గ్రీన్ ఎనర్జీ లక్ష్యం రాష్ట్రంలో పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని సీఎం సూచించారు. 2028-29 నాటికి సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారానే రావాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. పంప్డ్ స్టోరేజీ విధానంలో విద్యుత్ ఉత్పత్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, కాలుష్యాన్ని తగ్గించే విధంగా విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
*పరిశోధనలకు ఎనర్జీ యూనివర్శిటీ*
విద్యుత్ రంగంలో రీసెర్చ్‌కు పెద్దపీట విద్యుత్ రంగంలో పరిశోధన, విశ్లేషణకు పెద్దపీట వేయాలని సీఎం పేర్కొన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి సంస్థలు తమ సీఎస్సార్ నిధులను ఇందుకు వినియోగించాలని సూచించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని తెలిపారు. ప్రత్యేకంగా ఎనర్జీ యూనివర్శిటీ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.
*పీఎం సూర్యఘర్ పథకానికి వేగం*
ప్రతి నెల 2 లక్షల కనెక్షన్ల లక్ష్యం పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఇప్పటివరకు 52,396 సోలార్ రూఫ్‌టాప్ కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి ఇకపై ప్రతి నెల 2 లక్షల కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
*పీఎం కుసుమ్ పథకంలో పురోగతి*
2.94 లక్షల కనెక్షన్లు పూర్తి పీఎం కుసుమ్ పథకం కింద ఇప్పటివరకు 2.94 లక్షల కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.మొదటి విడత పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
*ఈవీ వాహనాలపై అవగాహన*
రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈవీ వాహనాల కొనుగోలు, వినియోగంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని చెప్పారు. భవిష్యత్తులో కాలుష్యరహిత రవాణా వ్యవస్థ కోసం ఇది కీలకమని వివరించారు.
*టెక్నాలజీతోనే ప్రజా ప్రయోజనం*
సంస్కరణల లక్ష్యం ప్రజలకు మేలు ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు అమలు చేస్తున్నామని, ఆ సంస్కరణల విజయానికి టెక్నాలజీ వినియోగం తప్పనిసరి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త ఆవిష్కరణలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మేలు జరిగేలా ప్రతి నిర్ణయం ఉండాలని ఆయన పేర్కొన్నారు.




