Amaravati: ఇంధన సరఫరాపై సీఎం హైలెవల్ రివ్యూ
Amaravati: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష. నేటి సాయంత్రానికి సరఫరా సాధారణ స్థితికి చేరుతుందని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
Amaravati: ఇంధన సరఫరాపై సీఎం హైలెవల్ రివ్యూ
Amaravati: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం వివరాలు కోరారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెంటనే సాధారణ పరిస్థితులు తీసుకురావాలని స్పష్టం చేశారు.
*ఈ సాయంత్రానికే సాధారణ పరిస్థితి*
అధికారులు, ఆయిల్ కంపెనీల హామీ ఈ రోజు సాయంత్రానికి రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు సాయంత్రం నాటికి రిటైల్ పెట్రోల్ బంకులకు చేరుకుంటాయని తెలిపారు. దీంతో పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు.
*సమన్వయంతో పని చేయాలి*
అధికారులు, ఆయిల్ కంపెనీలకు సీఎం ఆదేశం పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు పూర్తి సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ట్యాంకర్లు ఎటువంటి జాప్యం లేకుండా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
*కలెక్టర్లు, ఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణ*
ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి ప్రత్యక్షంగా సరఫరా వ్యవస్థను పరిశీలించాలని ఆదేశించారు.
*ప్రతి 3 గంటలకు నివేదిక*
ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతర మానిటరింగ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలని సీఎం ఆదేశించారు..ప్రతి మూడు గంటలకు ఒకసారి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సూచించారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే స్పందించేలా వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేశారు.
*మీడియా కథనాలపై వెంటనే స్పందించాలి*
సోషల్ మీడియా సమాచారం కూడా పరిశీలనలోకి మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు వెంటనే స్పందించాలని సీఎం సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
*బ్లాక్ మార్కెట్‌కు కఠిన హెచ్చరిక*
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు బ్లాక్ మార్కెట్ లేదా కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా అక్రమ అమ్మకాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలి పెట్రోల్, డీజిల్ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాధారణ సరఫరా పునరుద్ధరణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మరోసారి వెల్లడించారు.




