Polavaram: అనకాపల్లికి చేరిన గోదావరి జలాలు: నేడు సీఎం జలహారతి!
Polavaram: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరాయి. బుధవారం పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు నాయుడు జలహారతి సమర్పించి నీటిని విడుదల చేయనున్నారు.
Polavaram: అనకాపల్లికి చేరిన గోదావరి జలాలు: నేడు సీఎం జలహారతి!
పోలవరం: గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించే ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి నీరు అనకాపల్లి జిల్లా వరకు చేరింది. నదులు, కొండలు, సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ వచ్చిన ఈ జలాలు ఉత్తరాంధ్రలోని సాగు, తాగునీటి అవసరాలకు కొత్త భరోసాను ఇవ్వనున్నాయి.
పాయకరావుపేటలో బుధవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని గోదావరి జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు పాయకరావుపేట చేరుకోనున్న సీఎం.. కాలువపై ఏర్పాటు చేసిన రెగ్యులేటర్‌ను ప్రారంభించి గోదావరి జలాలను ముందుకు విడుదల చేయనున్నారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అనకాపల్లి జిల్లాకు ఈ ఏడాదిలోనే గోదావరి నీటిని తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పనులు ఇప్పుడు ఫలితాన్నిచ్చాయి. దీంతో పాయకరావుపేట నుంచి గోదావరి జలాల ప్రయాణం మరో దశకు చేరుకుంది.
నదులపై అక్విడెక్టులు.. భూగర్భంలో సైఫన్లు
పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో అనేక ఇంజినీరింగ్ సవాళ్లను అధిగమించారు. కాలువ మార్గంలో ఎదురయ్యే పాంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటేందుకు అక్విడెక్టులు, సైఫన్లు వంటి ప్రత్యేక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో నదులపై నుంచి, మరికొన్ని చోట్ల నదీ ప్రవాహానికి దిగువనుంచి నీటిని తరలించే విధంగా కాలువను రూపొందించారు.
ఏలేరు నది బెడ్ లెవల్ కంటే దిగువనుంచి నీటిని తీసుకెళ్లేందుకు సైఫన్ నిర్మించారు. పాంపా నదిపై 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో పునాదులు ఏర్పాటు చేసి అక్విడెక్టును నిర్మించారు. తాండవ నదిపై ఆరు వెంట్లతో 447 మీటర్ల పొడవైన అక్విడెక్టును నిర్మించారు. ఇది 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా రూపొందించారు. ఎడమ ప్రధాన కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.4,192 కోట్లు ఖర్చు చేశారు.
అనకాపల్లికి సాగునీటి వరం
గోదావరి జలాల రాకతో అనకాపల్లి జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. పాయకరావుపేట నుంచి విడుదలయ్యే నీటిని ఏలేరు కాలువతో అనుసంధానించడంతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా ప్రణాళిక రూపొందించారు.
పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పాంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరాహ, మామిడిగెడ్డ పరిధిలో 46,620 ఎకరాల ఆయకట్టుకు నీటి ప్రయోజనం కలగనుంది.
విశాఖకు.. ఆపై ఉత్తరాంధ్ర అంతటికీ
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా 23.44 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సాగునీటితో పాటు తాగునీరు, విశాఖ–అనకాపల్లి పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఈ నీటిని ఉపయోగించనున్నారు.
213 కిలోమీటర్ల పొడవైన ఎడమ ప్రధాన కాలువను భవిష్యత్తులో ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించనున్నారు. వచ్చే ఏడాది విశాఖకు గోదావరి నీటిని తీసుకెళ్లడం.. ఆ తర్వాత అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు నీటిని అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ అనుసంధానం పూర్తయితే ఉత్తరాంధ్రలో దాదాపు 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఏర్పడుతుంది. 5.23 లక్షల మందికి తాగునీరు అందడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు నీటి భరోసా పెరగనుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గోదావరి జలాలు కీలక మలుపుగా మారనున్నాయి.




