Polavaram: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: నేడు సీఎం చేతుల మీదుగా జలహారతి!
Polavaram: పోలవరం ఎడమ ప్రధాన కాలువ (LMC) మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపునకు బుధవారం సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు.
Polavaram: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: నేడు సీఎం చేతుల మీదుగా జలహారతి!
Polavaram: ఉత్తరాంధ్ర ప్రజలు రెండు, మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్ఎంసీ) ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తికావడంతో గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఎల్ఎంసీ ఫస్ట్ ఫేజ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన గోదావరి జలాల తరలింపు ఇప్పుడు సాకారం అవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎల్ఎంసీ నిర్మాణంలో ఉన్న అనేక క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి ఫస్ట్ ఫేజ్ పనులను పూర్తి చేసిందని తెలిపారు. భూసేకరణ, నిర్మాణాలు, నదులు, జాతీయ రహదారుల క్రాసింగ్‌లు, కొండ ప్రాంతాల్లో కాలువ నిర్మాణం వంటి అనేక సవాళ్లను అధిగమించి పనులు పూర్తి చేశామని చెప్పారు.
ఐదు ప్రధాన నదులను దాటుతూ కాలువ నిర్మాణం
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం సాధారణమైన పని కాదని మంత్రి వివరించారు. ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను దాటుకుంటూ కాలువను నిర్మించాల్సి వచ్చిందన్నారు. అదే విధంగా 11 ప్రాంతాల్లో జాతీయ రహదారులను క్రాస్ చేస్తూ కాలువ నిర్మాణ పనులు చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు.
కుమ్మరిలోవ వద్ద ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యను పరిష్కరించడంతో పాటు అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో దాదాపు 100 మీటర్ల లోతు వరకు కొండను కట్ చేసి కాలువ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. వేలాది నిర్మాణాలు, భూసేకరణ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, ఇతర అవాంతరాలను అధిగమించి కేవలం రెండేళ్లలో ఎల్ఎంసీ ఫస్ట్ ఫేజ్‌ను పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి అన్నారు.
ఐదేళ్లలో ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు
2019–2024 మధ్య ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాలువపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఐదేళ్ల కాలంలో ఎల్ఎంసీకి సంబంధించి ఒక్క తట్ట మట్టి పని కూడా జరగలేదని, ఒక్క రూపాయి విలువైన పని కూడా చేయలేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ పనులను వేగవంతం చేశామని, ఫలితంగా రెండేళ్లలోనే ఫస్ట్ ఫేజ్ పనులను పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వైపు మళ్లించే స్థాయికి చేరుకున్నామని తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జీవనాడి
పోలవరం ఎల్ఎంసీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి జీవనాడిగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. ఎల్ఎంసీ ద్వారా విశాఖపట్నం నగరానికి తాగునీరు అందించడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన నీటిని అందించే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ఉత్తరాంధ్రలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కూడా నీటి భద్రత కల్పించేందుకు ఈ కాలువ కీలకంగా మారుతుందని చెప్పారు.
నీరు అందుబాటులోకి వస్తే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలతో పెట్టుబడులు పెరుగుతాయని, పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని మంత్రి తెలిపారు. నీరు–పరిశ్రమలు–పెట్టుబడులు–ఉపాధి అనే అభివృద్ధి చక్రం ఉత్తరాంధ్రలో వేగం పుంజుకుంటుందని చెప్పారు.
గతంలో ఉత్తరాంధ్ర నుంచి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై ఉత్తరాంధ్రకే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
పోలవరం పూర్తయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేదు
2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని నిమ్మల రామానాయుడు తెలిపారు. అయితే పోలవరం పూర్తయ్యే వరకు ఉత్తరాంధ్ర ప్రజలు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా ఎల్ఎంసీకి నీటిని అందించే చర్యలు చేపట్టామని వివరించారు.
గతంలో పురుషోత్తపట్నం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులను వ్యతిరేకించిన వారు అధికారంలోకి వస్తే పంపులను పీకేస్తామని చెప్పారని మంత్రి విమర్శించారు. కానీ నేడు అదే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందించే పరిస్థితి ఏర్పడిందన్నారు.
పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణానికి రూ.29 కోట్లు
పోలవరం ఎల్ఎంసీ నిర్మాణ పనుల్లో భాగంగా పుష్కర లిఫ్ట్‌కు సంబంధించిన పంపులను తొలగించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.29 కోట్ల అంచనా వ్యయంతో పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. ఈ పనులు పూర్తయిన తర్వాత అదనంగా 700 నుంచి 1,500 క్యూసెక్కుల వరకు నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
దీంతో ఎల్ఎంసీకి నీటి లభ్యత మరింత పెరిగి ఉత్తరాంధ్ర అవసరాలకు నీటిని సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
11 ప్రాధాన్యతా ప్రాజెక్టులకు రూ.2,500 కోట్లు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేసి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
మూడు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న నేరడి బ్యారేజీకి అవసరమైన అనుమతులను కూటమి ప్రభుత్వం సాధించిందని మంత్రి తెలిపారు. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో నేరడి బ్యారేజీ పనులను పట్టాలెక్కిస్తామని, తద్వారా ఉత్తరాంధ్ర మరో చిరకాల కలను సాకారం చేస్తామని స్పష్టం చేశారు.
కృష్ణా జలాలు ప్రకాశానికి.. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు
వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలను తరలించే చర్యలు చేపట్టామని, ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా, గోదావరి నదీ జలాలను సమర్థంగా మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రంలో నీటి వనరులను గరిష్ఠంగా వినియోగించుకుని ప్రతి ప్రాంతానికి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీటి భద్రత కల్పిస్తేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి ఉత్తరాంధ్ర గుండెకాయ వంటిదని, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు తాగునీరు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
కొత్త అభివృద్ధి శకానికి నాంది
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకోవడం ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక మలుపుగా మారనుంది. విశాఖ నగర తాగునీటి అవసరాలు, పారిశ్రామిక నీటి అవసరాలకు భద్రత కల్పించడంతో పాటు సాగునీటి అవకాశాలను కూడా విస్తరించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది.
నీటి లభ్యత పెరగడంతో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఏర్పడి, భారీ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో ఉత్తరాంధ్రలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల ఇప్పుడు కార్యరూపం దాల్చుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉత్తరాంధ్రలో సాగు, తాగునీరు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో కొత్త అవకాశాలకు ఎల్ఎంసీ బాటలు వేస్తుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇది కీలకమైన మౌలిక వసతిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.




