Amaravati: ఇళ్ల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్.. పెండింగ్ సమస్యలకు ఫుల్ స్టాప్!

Amaravati: ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గృహనిర్మాణ బిల్లుల చెల్లింపు మరియు ఇసుక అక్రమ రవాణాపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 3 Jun 2026 8:48 AM IST
Amaravati
X

Amaravati: ఇళ్ల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్.. పెండింగ్ సమస్యలకు ఫుల్ స్టాప్!

Amaravati: రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపనుంది. ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల స్థాయిలో పరిష్కరించగలిగిన కేసులను వెంటనే పరిష్కరించాలని, అక్కడ సాధ్యం కాని వాటిని కేబినెట్ ముందుకు తీసుకురావాలని సూచించారు. వివాదాలు లేని స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం ప్రతి జిల్లా నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించాలని చెప్పారు. ప్రజలు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి..

*కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు.. ప్రతి కేసుపై ప్రత్యేక దృష్టి*

ప్రతి జిల్లాలో క్రమబద్దీకరణకు అర్హమైన ఇళ్లు, స్థలాల జాబితాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. స్థానిక స్థాయిలో పరిష్కారం కుదిరే అంశాలను అక్కడే పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా స్థాయిలో సాధ్యం కాని అంశాలను కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి కేబినెట్ సమావేశానికి వివాదాలు లేని భూముల క్రమబద్దీకరణ ప్రతిపాదనలు తీసుకురావాలని సూచించారు. ఇంకా మిగిలే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ప్రజలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది..

*గృహనిర్మాణ శాఖ బిల్లుల చెల్లింపులకు మార్గం సుగమం

గృహనిర్మాణ శాఖలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుల అంశంపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడం వల్ల పనులు మందగిస్తున్నాయని గుర్తించిన ఆయన, వెంటనే చెల్లింపు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ విషయంలో గృహనిర్మాణ శాఖ, ఆర్థిక శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్ బిల్లులు క్లియర్ అయితే నిర్మాణ రంగంలో వేగం పెరిగి, లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు..

*ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం.. సరిహద్దులు దాటితే సీజ్*

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో తవ్విన ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదని కఠిన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దులు దాటే వాహనాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పారు. ఇప్పటికే వేలాది వాహనాలకు జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ అమలు చేస్తున్నామని, దాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే వెంటనే అలెర్ట్ సందేశాలు వచ్చేలా టెక్నాలజీ వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు..

*ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి*

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రచారం కోసం కాకుండా ప్రజలకు సమాచారం అందించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే సేవలు, పథకాలు ప్రజలకు తెలిసినప్పుడే వాటి ప్రయోజనం పూర్తిగా అందుతుందని చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు వివరాలు తెలియజేయాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సేవలపై ప్రజల్లో నమ్మకం, సంతృప్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు...

*రాజవొమ్మంగి సీడీపీఓ ఘటనపై కఠిన హెచ్చరిక*

రాజవొమ్మంగి సీడీపీఓ ఆత్మహత్య ఘటనను సీఎం తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయాల్లో వేధింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. సమస్యలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే గుర్తించి నివారించే వ్యవస్థ ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను నిరంతరం విశ్లేషిస్తూ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు...

*సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పరిపాలనలో వేగం పెంచాలన్న సీఎం*

ఈ సమీక్ష సమావేశం ద్వారా ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న అంశాలపై ప్రభుత్వం మరింత చురుకుగా వ్యవహరించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇళ్ల క్రమబద్దీకరణ నుంచి గృహనిర్మాణ బిల్లులు, ఇసుక నియంత్రణ నుంచి ఉద్యోగుల భద్రత వరకు ప్రతి అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్యలు పేరుకుపోయే పరిస్థితికి ముగింపు పలికి, వేగవంతమైన పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమావేశం స్పష్టం చేసింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story