Amaravati: ప్రతి కుటుంబానికి సంక్షేమం లక్ష్యం.. టెక్నాలజీ ఆధారిత పాలనపై సీఎం ఫోకస్

Amaravati: అమరావతిలో సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ సమీక్ష.

Hari Kishan  AP Bureau Chief
Published on: 13 May 2026 11:33 AM IST
Amaravati
X

Amaravati: ప్రతి కుటుంబానికి సంక్షేమం లక్ష్యం.. టెక్నాలజీ ఆధారిత పాలనపై సీఎం ఫోకస్

Amaravati: అమరావతిలో నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని స్పష్టం చేసిన సీఎం... “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” ద్వారా సంక్షేమాన్ని మరింత సమర్థంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమపాళ్లలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

*అన్న క్యాంటీన్లపై ప్రత్యేక దృష్టి,

మహిళల భద్రతపై కఠిన హెచ్చరిక*

అన్న క్యాంటీన్లలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నిత్యం తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. మహిళలపై నేరాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని... లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా పోలీసింగ్ ఉండాలని సూచించారు. నేరం చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని స్పష్టం చేశారు.

*సోలార్ విద్యుత్.. తాగునీరు.. వ్యవసాయంపై ఫోకస్*

రైతులకు ఆధునిక సాగుపై అవగాహన

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు ఉండాలన్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని... ఉద్యాన పంటల వల్ల వచ్చే లాభాలను రైతులకు వివరించాలని సూచించారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలో రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.

జలహారతి పనులకు మ్యాపింగ్

రోడ్ల గుంతలపై నిరంతర పర్యవేక్షణ

జలధార, జలహారతి పనులను వేగవంతం చేయాలని... జరుగుతున్న పనులన్నింటినీ మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. నీటి భద్రత ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. రోడ్లపై గుంతల సమస్యను పూర్తిగా తొలగించాలని... క్షేత్రస్థాయి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో బస్సులకు సీసీ కెమెరాలు అమర్చి రోడ్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారని... అదే తరహాలో మరిన్ని వినూత్న విధానాలు తీసుకురావాలని సూచించారు...

*ప్రపంచ స్థాయి టెక్నాలజీపై దృష్టి*

డేటా ఆధారిత పాలన అవసరం

ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీలను రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా అమరావతిని టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేస్తే యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని అన్నారు. ఐటీ రంగంలో భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని... కొత్త టెక్నాలజీల విషయంలో కూడా ముందుండాల్సిన అవసరం ఉందన్నారు. పాలనలో డేటా ఆధారిత నిర్ణయాలు, ప్రిడిక్టివ్ అడ్వాన్స్డ్ ప్లానింగ్ ఉండాలని... ఇందుకు అవసరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story