Amaravati: కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడేది ఇరిగేషన్ ప్రాజెక్టులే..
Amaravati: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
Amaravati: కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడేది ఇరిగేషన్ ప్రాజెక్టులే..
Amaravati: ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని.. రైతులు, వినియోగదారులపై ఆ ప్రభావం పడకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా చూడటంతో పాటు.. నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించి.. రైతులకు రాయితీపై విత్తనాలు అందించడంతో పాటు అవసరమైతే కనీస మద్దతు ధర కల్పించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు దెబ్బతింటే రైతులకు పంటల బీమా ప్రయోజనం పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రైతులు.. వినియోగదారులపై ప్రభావం పడొద్దు
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో కారణంగా కేవలం నీటి సమస్య మాత్రమే కాకుండా.. పంటల దిగుబడులు తగ్గితే నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. అందుకే రైతులతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలన్నారు.
భవిష్యత్తులో ఏ పంటలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందో ముందుగానే అంచనా వేసి.. ఆ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైతే ఆయా పంటలకు సంబంధించిన విత్తనాలను రైతులకు రాయితీపై అందించాలని ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటలకు కనీస మద్దతు ధర కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పారు. ఇలా చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి పంటలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తగ్గుతుందని అన్నారు.
ఉల్లి.. పప్పుధాన్యాలు.. చిరుధాన్యాలపై దృష్టి
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. ఉల్లి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు వంటి డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. ఒకే పంటపై ఆధారపడకుండా మల్టీ క్రాప్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రైతు బజార్లను మరింత చురుగ్గా నిర్వహించి.. వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసరాలు అందేలా చూడాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం ఏయే పంటలను కొనుగోలు చేస్తుందో కూడా అధికారులు పరిశీలించాలని సీఎం సూచించారు. మార్కెట్ డిమాండ్, ప్రభుత్వ కొనుగోళ్లు, నీటి లభ్యత వంటి అంశాలను సమన్వయం చేసుకుని రైతులకు ముందుగానే పంటలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని చెప్పారు.
బీమానే రైతులకు ధీమా
ఎల్‌నినో సమయంలో పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతులకు పంటల బీమా విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ రైతు ఏ పంటకు బీమా చేసుకున్నారో జిల్లా కలెక్టర్లు స్పష్టమైన జాబితాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
బీమా చేసిన పంటకు బదులుగా మరో పంట సాగు చేస్తే.. బీమా ప్రయోజనం కోల్పోయే అవకాశం ఉంటుందని సీఎం హెచ్చరించారు. అందువల్ల రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని చెప్పారు. రైతులు బీమా చేసుకున్న పంటలనే సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ఎల్‌నినో కారణంగా పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వం, బీమా వ్యవస్థ నుంచి అందాల్సిన ప్రయోజనం తప్పనిసరిగా అందేలా చూడాలన్నారు.
ప్రకృతి వ్యవసాయం.. వర్షాధార పంటలకు ప్రోత్సాహం
ఎల్‌నినో పరిస్థితుల్లో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూమిలో తేమను కాపాడే విధానాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ విధానాలను ప్రోత్సహించాలని అన్నారు. వర్షాధార పంటలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పశుగ్రాసం సాగు చేయాలని సూచించారు.
పచ్చదనం తగ్గకుండా చర్యలు చేపట్టాలని.. అవసరమైతే చివరి దశలో మల్చింగ్ కోసం విత్తనాలు వేసి భూమిపై పచ్చదనం ఉండేలా చూడాలని చెప్పారు. విత్తనాలను డ్రోన్ల ద్వారా చల్లించే విధానాన్ని కూడా విస్తృతంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు.. రైతులకు అవగాహన
ఎల్‌నినో ప్రభావంపై తాను ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. తాను కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతానని చెప్పారు. మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఫీల్డ్‌లో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావం రైతులపై పడకుండా చూడటంతో పాటు.. వినియోగదారులపై కూడా భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విపత్తులను పూర్తిగా ఆపడం సాధ్యం కాదని.. అయితే విపత్తుల ప్రభావాన్ని ప్రజలపై పడకుండా తగ్గించడం ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పట్టిసీమతో లక్షల ఎకరాల సాగుకు రక్షణ
ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడటమేనని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడం వల్లే ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఎల్‌నినో లాంటి పరిస్థితుల్లో నీటి సమస్య మరింత తక్కువగా ఉండేదని అన్నారు.
ప్రస్తుతం పట్టిసీమ నుంచి 8,100 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందని.. ప్రకాశం బ్యారేజీకి 6,700 క్యూసెక్కుల నీరు వస్తోందని సీఎం వివరించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 39.5 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించినట్లు తెలిపారు. తీవ్రమైన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ ఈ నీటితో డెల్టాలోని లక్షల ఎకరాల సాగును కాపాడగలిగామని చెప్పారు.
మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలి
రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా కాలువ పనులను వేగంగా పూర్తి చేసిన స్ఫూర్తితో మిగిలిన ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
కరవు నివారణలో ఈ ప్రాజెక్టులే కీలకమని చెప్పారు. గోదావరి–కావేరి అనుసంధానం, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ నీరు అందించే అవకాశం ఉందన్నారు. నిర్దేశిత గడువు కంటే నెల ముందుగానే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేగంగా పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లు, అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.
వచ్చే వేసవి వరకు నీటి ప్రణాళిక
రాష్ట్రంలో వచ్చే వేసవి వరకు తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని చెప్పారు. సాధ్యమైనంత మేర చెరువులను నింపి నీటి లభ్యతను పెంచాలని సూచించారు.
నీటి వనరులు లేని ప్రాంతాలకు సమీప ప్రాంతాల నుంచి నీటిని తరలించే ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలని అన్నారు. గతంలో తిరుమలలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కేవలం వంద రోజుల్లో పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీటి సంక్షోభాన్ని నివారించామని గుర్తు చేశారు. అదే విధంగా ముందస్తు ప్రణాళికతో పనిచేస్తే ఎలాంటి నీటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు.
భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి
నీటి సరఫరాతో పాటు భూగర్భ జలాలను పెంచే పనులను కూడా వేగవంతం చేయాలని సీఎం సూచించారు. జలధార పనులు నిరంతరం కొనసాగాలని.. ట్రెంచ్‌లు తవ్వడం, వివిధ రకాల నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా తరహాలో అంతర్గత బేసిన్లను అనుసంధానం చేసి భూగర్భ జలాలను పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులను నింపే అంశంపై ప్రత్యేక బ్లూప్రింట్ సిద్ధం చేయాలని అన్నారు. ఎల్‌నినో సంక్షోభ సమయంలో వ్యవసాయం, పశుసంవర్థక, జలవనరులు, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పశుగ్రాసం.. హార్టికల్చర్‌పైనా ఫోకస్
కరవు పరిస్థితుల్లో పశువులకు దాణా, నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పశువుల షెడ్లు, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖతో పాటు పశుసంవర్థక, జలవనరులు, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హార్టికల్చర్ రంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
ఎల్‌నినోను కేవలం వాతావరణ సమస్యగా కాకుండా.. వ్యవసాయం, నీటి వనరులు, పశుసంవర్థక రంగం, నిత్యావసరాల ధరలు, ప్రజల జీవనంపై ప్రభావం చూపే అంశంగా ప్రభుత్వం పరిగణించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విపత్తులను ఆపలేకపోయినా.. వాటి ప్రభావాన్ని ముందస్తు ప్రణాళికతో తగ్గించవచ్చని.. అదే ప్రభుత్వ బాధ్యత అని అధికారులకు దిశానిర్దేశం చేశారు...




