Amaravati: ఏఎఫ్‌డీటీ విద్యాసంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి!
Amaravati: కోనసీమ జిల్లా మలికిపురం ఏఎఫ్‌డీటీ విద్యాసంస్థలను ప్రభుత్వంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేసిన సీపీఐ నేతలు కె.రామకృష్ణ, గుజ్జుల ఈశ్వరయ్య.
Amaravati: ఏఎఫ్‌డీటీ విద్యాసంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి!
Amaravati: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం మలికిపురంలో 1948లో స్థాపించబడిన ఏఎఫ్డిటి విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యాసంస్థలకు సంబంధించిన విలువైన ఆస్తులను పరిరక్షించడంతో పాటు, సంస్థ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని వారు సీఎంను కోరారు.
ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తిస్థాయిలో అమలు చేయాలి
పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు, ఈ ప్రాంత ప్రజల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏఎఫ్డిటి విద్యాసంస్థల వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏఎఫ్డిటికి చెందిన డిగ్రీ కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మారుస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో నంబర్ 12)ను పూర్తిస్థాయిలో అమలు చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అదేవిధంగా, ఏఎఫ్డిటి ధర్మకర్తల సంస్థకు సంబంధించిన విలువైన ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా, అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆస్తుల పరిరక్షణ, విద్యాసంస్థల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రభుత్వ అధికారిని నియమించాలని వారు కోరారు.
సిబ్బందికి బకాయి వేతనాలు చెల్లించాలి
ఏఎఫ్డిటి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందికి బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు, తక్షణ ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాసంస్థల భవిష్యత్తును, సిబ్బంది సమస్యలను పరిగణనలోకి తీసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు.




