అర్నబ్ తుపాను బీభత్సం.. 27 జిల్లాలకు భారీ వర్ష సూచన... రూ.27 కోట్ల అత్యవసర నిధులు విడుదల

Amaravati: అర్నబ్ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం. బాపట్ల-విశాఖ మధ్య యానాం వద్ద తీరం దాటే ముప్పు. ఏపీఎస్‌డీఎంఏ ప్రకటన, అత్యవసర చర్యల కోసం ప్రభుత్వం రూ.27 కోట్లు విడుదల.

Hari Kishan  AP Bureau Chief
Published on: 26 Oct 2026 11:05 PM IST
Amaravati
X

అర్నబ్ తుపాను బీభత్సం.. 27 జిల్లాలకు భారీ వర్ష సూచన... రూ.27 కోట్ల అత్యవసర నిధులు విడుదల

అమరావతి: ఏర్పడిన అర్నబ్ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో విస్తారంగా వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధం చేయడంతో పాటు, అత్యవసర చర్యల కోసం రూ.27 కోట్ల నిధులను మంజూరు చేసింది.

ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అర్నబ్ తీవ్ర తుపాను గత ఆరు గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌, విశాఖపట్నానికి 490 కిలోమీటర్లు, కాకినాడకు 560 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, బాపట్లకు 730 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రానున్న 12 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, ఆ తర్వాత వాయువ్య దిశగా మలుపు తీసుకునే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని తెలిపారు.

*రెండు రోజుల పాటు భారీ వర్షాలు*

మంగళవారం (అక్టోబర్ 27) కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చు. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

బుధవారం (అక్టోబర్ 28) విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

*సహాయక బృందాలు సిద్ధం*

తుపాను ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే ఎనిమిది ఎస్డీఆర్‌ఎఫ్‌, ఏడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. అదనంగా మూడు ఎస్డీఆర్‌ఎఫ్‌, మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఒడిశా నుంచి వచ్చిన మరో రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. అగ్నిమాపక శాఖకు చెందిన 115 చెట్ల తొలగింపు బృందాలు, 13 బోటు రెస్క్యూ బృందాలు, 76 ఆస్కా లైట్లు, 853 లైఫ్‌బోయ్‌లు, 1,328 లైఫ్‌ జాకెట్లతో సహాయక చర్యలకు ఏర్పాట్లు చేశారు.

*అత్యవసర చర్యలకు రూ.27 కోట్లు*

తుపాను సహాయక చర్యలు, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, తాగునీరు, ఆహారం, పాలు అందించడం, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారులు, మౌలిక సదుపాయాల అత్యవసర మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌-27 కింద రూ.27 కోట్లను మంజూరు చేసింది. విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.14 కోట్లు కేటాయించారు. ప్రకాశం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్‌, ఏలూరు, అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున మరో రూ.13 కోట్లు కేటాయించారు.

తుపాను నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్లు, భారీ హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండకూడదని అధికారులు సూచించారు. సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.