అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి..ప్రజల ప్రాణ రక్షణే తొలి ప్రాధాన్యం.. అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు..
Amaravati: అర్నబ్ తుపానుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష. నిబంధనల మేరకు పంచాయతీరాజ్ సిబ్బంది సెలవులు రద్దు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఆదేశం.
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి..ప్రజల ప్రాణ రక్షణే తొలి ప్రాధాన్యం.. అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు..
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, మత్స్యకార ఆవాసాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీ ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ-యానాం పరిసర ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండవచ్చన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున వాతావరణ హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల తరలింపులో నిర్లక్ష్యం వద్దు
తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామాలను గుర్తించి, పూరిళ్లు, బలహీనమైన ఇళ్లు, శిథిల భవనాల్లో నివసించే వారిని ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావం తగ్గే వరకు తన పరిధిలోని శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్లు, ఇంధన నిల్వలు సిద్ధంగా ఉంచాలని గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ప్రజలకు నీరు అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా కాలువల్లో అడ్డంకులను తొలగించాలని, అవసరమైన యంత్రాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తుపాను అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.
పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు
బాపట్ల నుంచి అనకాపల్లి వరకు తీర ప్రాంత గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, విద్యుత్, జనరేటర్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిన్నారులకు పాలు, వృద్ధులకు అవసరమైన మందులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అధికారిక అనుమతి వచ్చే వరకు వేటకు వెళ్లవద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. బోట్లు, వలలు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని సూచించారు. చెరువులు, కాలువలు, వాగులు, చెరువు కట్టలు, గ్రామీణ రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ప్రజలు సముద్ర తీరాలు, బీచ్‌లకు వెళ్లవద్దని, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రమాదకర ప్రాంతాలకు చేరుకోవద్దని హెచ్చరించారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. అన్ని శాఖల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




