Rayalaseema: రతనాల సీమ దిశగా.. రూ.8,022 కోట్లతో పవన్ కళ్యాణ్ అభివృద్ధి విజన్!

Rayalaseema: రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.8,022 కోట్లతో ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 30 Aug 2026 9:05 PM IST
Rayalaseema
X

Rayalaseema: రతనాల సీమ దిశగా.. రూ.8,022 కోట్లతో పవన్ కళ్యాణ్ అభివృద్ధి విజన్!

రాయలసీమ: రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, జల సంరక్షణ, రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా, ఉద్యాన సాగు, పాడి పరిశ్రమ, అటవీ సంరక్షణ, పట్టణ పచ్చదనం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. గడచిన రెండేళ్లలో రాయలసీమలో సుమారు రూ.8,022 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

గ్రామసభలతో అభివృద్ధికి శ్రీకారం

పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 13,326 పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రజల అవసరాలను తెలుసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరువారిపల్లి గ్రామాన్ని ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టడం లక్ష్యంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

పంట కుంటలతో సీమకు జలసిరులు

బీటలు వారిన నేలలు, తరచూ ఎదురయ్యే కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడే రాయలసీమకు జల సంరక్షణ చర్యలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫారం పాండ్లు లేదా పంట కుంటల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచర్లలో పంట కుంటల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మొదటి దశలో రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో 40,837 పంట కుంటలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దానిని అధిగమించి 41,614 వ్యవసాయ చెరువులను నిర్మించారు. ఇందుకోసం రూ.166.46 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో మరో 29,902 ఫారం పాండ్లు మంజూరు కాగా, వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. రెండు దశల పనుల ఫలితంగా రాయలసీమలో 50 వేల ఎకరాలకు పైగా అదనపు సాగు విస్తీర్ణం అందుబాటులోకి వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.

15 వేల మినీ గోకులాలతో పాడి రైతుకు అండ

వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయ వనరుగా మార్చే దిశగా మినీ గోకులాల నిర్మాణాన్ని చేపట్టారు. రాయలసీమ వ్యాప్తంగా గత రెండేళ్లలో సుమారు 15 వేల మినీ గోకులాలు నిర్మించారు. మరో మూడు వేల గోకులాలు వివిధ దశల్లో ఉన్నాయి.

మొదటి దశలోనే 9,708 మినీ గోకులాలను నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 కార్యక్రమాల కింద వ్యక్తిగత పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.170 కోట్లకు పైగా వ్యయం చేశారు. పశువులకు రక్షణతో పాటు నీటి తొట్టెలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పాడి రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు.

హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ

రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగిస్తున్నారు. పండ్ల తోటలు, పూలు, మునగ వంటి ఉద్యాన పంటల సాగుకు రైతులకు సహకారం అందిస్తున్నారు.

రెండు దశల్లో సుమారు 62 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చేపట్టేందుకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 28 వేల మందికి పైగా రైతులు లబ్ధి పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఏటా రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉండటంతో చిన్న, సన్నకారు రైతులకు ఈ కార్యక్రమం జీవనోపాధికి భరోసాగా నిలుస్తోంది.

కుంకీ ఏనుగులతో మానవ–వన్యప్రాణి ఘర్షణలకు చెక్

అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో అడవి ఏనుగుల సంచారం వల్ల రైతులు, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తున్నారు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల కోసం పలమనేరు నియోజకవర్గంలోని ముసలమడుగులో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులు దాదాపు 15 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కుంకీల రాకతో మానవ–ఏనుగుల ఘర్షణలు సుమారు 75 శాతం తగ్గగా, పంట నష్టం కూడా 50 శాతం మేర తగ్గినట్లు పేర్కొంటోంది. దీంతో సరిహద్దు గ్రామాల్లో రైతులకు కొంత ఊరట లభిస్తోంది.

13 నగర వనాలతో పచ్చదనానికి ప్రాధాన్యం

గ్రామీణ ప్రాంతాలతో పాటు రాయలసీమ పట్టణాల్లోనూ పచ్చదనాన్ని పెంచే చర్యలు చేపట్టారు. పట్టణాలకు పచ్చని ఊపిరితిత్తులుగా నిలిచే నగర వనాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రూ.26 కోట్లతో 13 నగర వనాల నిర్మాణం పూర్తయింది.

కళ్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి సత్యసాయి ఎకో పార్క్, బద్వేల్, తిరుపతి కైలాసగిరి, కోడూరు, డోన్ తదితర ప్రాంతాల్లో నగర వనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రదేశాలను అందించడమే వీటి ప్రధాన ఉద్దేశం.

జేజేఎం–అమరజీవి జలధారతో తాగునీటి భరోసా

రాయలసీమలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పథకాల పనులను వేగవంతం చేస్తున్నారు. మొత్తం రూ.2,782 కోట్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.

పులివెందుల మల్టీ విలేజ్ వాటర్ స్కీమ్ గతంలో అసంపూర్తిగా నిలిచిపోగా, దాన్ని పూర్తి చేసేందుకు రూ.280 కోట్లతో పనులు చేపట్టారు. రూ.480 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం జల్ జీవన్ మిషన్ గడువు ముగియడంతో నిలిచిపోయింది. కేంద్రంతో సమన్వయం చేసి జల్ జీవన్ మిషన్ గడువు పొడిగించడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే పులివెందుల గ్రామీణ, సింహాద్రిపురం మండలాల పరిధిలో ప్రజలకు తాగునీరు అందుతోంది.

డోన్, చిత్తూరు మెగా వాటర్ గ్రిడ్‌కు ఊపు

డోన్ మల్టీ విలేజ్ వాటర్ స్కీమ్‌ను కూడా రూ.132 కోట్లతో చేపట్టి పూర్తి దశకు తీసుకొచ్చారు. ఈ పథకం అందుబాటులోకి వస్తే సుమారు మూడున్నర లక్షల మందికి తాగునీరు అందనుంది.

అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,370 కోట్లతో చిత్తూరు మెగా వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో సుమారు 25 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేలా ఈ పథకాన్ని రూపొందించారు.

రూ.4,523 కోట్లతో 23 వేల రోడ్ల పనులు

గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధికి కీలకమైన మౌలిక వసతులు. ఈ నేపథ్యంలో పల్లెపండుగ, పల్లెపండుగ 2.0, సాస్కీ తదితర పథకాల కింద రాయలసీమలో రూ.4,523 కోట్ల అంచనా వ్యయంతో 23 వేలకు పైగా రోడ్ల పనులు చేపట్టారు.

మొత్తం 4,630 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 3,067 కిలోమీటర్ల సీసీ రోడ్ల పనులు మంజూరయ్యాయి. వీటిలో 2,582 కిలోమీటర్ల బీటీ, 2,655 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

వైఎస్ఆర్ కడప జిల్లాకు రూ.876 కోట్లు, అనంతపురం జిల్లాకు రూ.691 కోట్లు, తిరుపతి జిల్లాకు రూ.521 కోట్లు, అన్నమయ్య జిల్లాకు రూ.518 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.483 కోట్లు కేటాయించారు. పుట్టపర్తి ప్రాంతంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు అదనపు చర్యలు చేపట్టారు.

పారిశుధ్యం, భూగర్భ జలాలపై ప్రత్యేక దృష్టి

రోడ్లతో పాటు గ్రామీణ పారిశుధ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. పలు గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. 50 వేలకు పైగా వ్యక్తిగత కంపోస్ట్ గుంతలు, భూగర్భ జలాల రీచార్జ్‌కు ఉపయోగపడే 28 వేలకు పైగా ఇంకుడు గుంతలు నిర్మించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకించే చర్యలు భవిష్యత్ నీటి అవసరాలను తీర్చడంలో కీలకంగా మారనున్నాయి.

రాయలసీమ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణాభివృద్ధికి అనుసంధానిస్తూ రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వీబీజీ–రాంజీ పథకం ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం కేంద్రాలు, హస్తకళాకారుల కోసం వుడ్ బ్యాంకుల ఏర్పాటు వంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు.

జల సంరక్షణ నుంచి తాగునీటి సరఫరా వరకు.. రహదారుల నుంచి ఉద్యాన సాగు వరకు.. పాడి రైతుల నుంచి అటవీ ప్రాంతాల ప్రజల వరకు.. రాయలసీమలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా కార్యాచరణ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఈ ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలైతే రాయలసీమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story