Antarvedi: అంతర్వేది అభివృద్ధికి పవన్ కల్యాణ్ శ్రీకారం.. రూ.30 కోట్ల పనులకు వర్చువల్ ప్రారంభోత్సవం!
Antarvedi: అంతర్వేదిలో రూ.30 కోట్లతో చేపట్టిన జల జీవన్ మిషన్ మంచినీటి పథకం, రహదారి నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు.
Antarvedi: అంతర్వేది అభివృద్ధికి పవన్ కల్యాణ్ శ్రీకారం.. రూ.30 కోట్ల పనులకు వర్చువల్ ప్రారంభోత్సవం!
అంతర్వేది/అమరావతి: అంతర్వేది లో రూ.30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను అమరావతి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. అంతర్వేది దేవస్థానం గ్రామంలో జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ.17.33 కోట్లతో నిర్మించిన మంచినీటి పథకాన్ని,రూ.5 కోట్ల ఓఎన్జీసీ నిధులతో గుడిమెళ్లంక తాగునీటి ప్రాజెక్ట్ వద్ద ర్యాపిడ్ శాండ్ పిల్లర్ నిర్మాణానికి భూమి పూజ, సఖినేటిపల్లి లోని బోను నుంచి గుడిమూల వరకు ఏటిగట్టు పై 5.5 కిలోమీటర్ల మేర రూ.7.10 కోట్లతో నిర్మించనున్న రహదారికి భూమి పూజ వంటి కార్యక్రమాలను వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అంతర్వేది అభివృద్ధికి కృత నిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు.తాను రాజోలు పర్యటనకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు చాలా సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, వీటన్నింటినీ త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.అలానే మంచినీటి చెరువు పరిసర ప్రాంతం అంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కి సూచించారు.
ఈ కార్యక్రమంలో వర్చువల్ గా వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు పాల్గొని గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం, నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని గత వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్నికల హామీలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తామనే హామీ లో భాగంగా ఈరోజు ఈ త్రాగునీరు అందరికీ అందివ్వడం జరుగుతుంది అన్నారు.అంతర్వేది,పరిసర ప్రాంతాలలో ఎంతో కాలంగా పేరుకుపోయిన అన్ని సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ... 2025 లో జలజీవన్ మిషన్ పథకం పూర్తయిందని,దానిని పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 2028 వరకు ఈ పథకాన్ని పొడిగించడం వలనే ఈరోజు ఈ పథకం పూర్తి చేసుకునే అదృష్టం, అవకాశం కలిగిందన్నారు.ఈ మంచినీటి ప్రాజెక్టు ద్వారా నాలుగు తీర గ్రామాల ప్రజలకు త్రాగునీరు సమస్య పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. గత దశాబ్ద కాలంగా ఈ తీర ప్రాంతం అంతా ఉప్పు నీటి మయమైందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పుడు ఈ పథకం ద్వారా ఈ తీర ప్రాంతంలోని ప్రజలకు త్రాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం,చొరవతో అమరజీవి జలధార పథకం కింద రూ.1,650/- కోట్లతో పైప్ ల ద్వారా భారీ మంచినీటి పథకాన్ని తీసుకురావడం జరిగుతుందని,ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయితే నియోజకవర్గం అంతా త్రాగునీరు సమస్య లేకుండా అవుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తెదేపా ఇంచార్జి గొల్లపల్లి అమూల్య,ఆర్డబ్యుఎస్ ఈఈ రాజన్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా మరియు అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.


