Amaravati: పోలీసుల కోసం 'విహార', 'విహారి' భవనాలు, సెంట్రల్ క్యాంటీన్‌కు శంకుస్థాపన

Amaravati: మంగళగిరిలో పోలీసుల వసతి కోసం విహార, విహారి భవనాలు మరియు సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ నిర్మాణానికి డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా శంకుస్థాపన చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Aug 2026 10:44 PM IST
Amaravati
X

Amaravati: పోలీసుల కోసం 'విహార', 'విహారి' భవనాలు, సెంట్రల్ క్యాంటీన్‌కు శంకుస్థాపన

అమరావతి: పోలీసు సిబ్బంది సంక్షేమం, వారికి మెరుగైన వసతి సౌకర్యాల కల్పనలో భాగంగా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. అధికారిక విధులపై వివిధ జిల్లాల నుంచి మంగళగిరికి వచ్చే పోలీసు సిబ్బందికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు 6వ బెటాలియన్ ఏపీఎస్పీ ప్రాంగణంలో పురుషుల కోసం ‘విహార’, మహిళల కోసం ‘విహారి’ పేరుతో ప్రత్యేక ట్రాన్సిట్ అకామడేషన్ భవనాలను నిర్మించనున్నారు. వీటితోపాటు సమీకృత సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఒక్కో భవనం 13,603 చదరపు అడుగుల్లో

పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, బందోబస్తు విధులు, ఇతర అధికారిక పనుల నిమిత్తం రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్ల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది మంగళగిరికి వస్తుంటారు. వారికి తగిన వసతి అందుబాటులో లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డీజీపీ ఆదేశాల మేరకు ‘విహార’, ‘విహారి’ భవనాల నిర్మాణాన్ని చేపట్టారు.

పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్మించే ఒక్కో భవనం సుమారు 13,603 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్తులతో రూపుదిద్దుకోనుంది. ‘విహార’లో సుమారు 120 మంది పురుష పోలీసు సిబ్బంది, ‘విహారి’లో 120 మంది మహిళా పోలీసు సిబ్బంది బస చేసేందుకు వీలుగా సదుపాయాలు కల్పించనున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి అధికారిక పనులపై మంగళగిరికి వచ్చే సిబ్బందికి సురక్షితమైన, అందుబాటు ధరలో, సౌకర్యవంతమైన శాఖాపరమైన వసతి కల్పించడం ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం. దీనివల్ల బయట వసతి కోసం వెతకాల్సిన అవసరం, అదనపు వ్యయం తగ్గడంతోపాటు సిబ్బందికి క్రమబద్ధమైన, గౌరవప్రదమైన బస సౌకర్యం అందుబాటులోకి రానుంది.

20 వేల చదరపు అడుగుల్లో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్..

పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, సంక్షేమ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 6 వ బెటాలియన్ APSP ప్రాంగణంలో సమీకృత సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ నిర్మించనున్నారు. దీనికీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా శంకుస్థాపన చేశారు.

ప్రస్తుతం 6వ బెటాలియన్ ఏపీఎస్పీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న పోలీస్ క్యాంటీన్.. పెరుగుతున్న అవసరాలకు సరిపోవడం లేదు. పోలీస్ ప్రధాన కార్యాలయంతోపాటు సమీపంలోని సీఐడీ, పోలీస్ కమ్యూనికేషన్స్, పీసీఎస్‌అండ్‌ఎస్, ఆక్టోపస్, పీటీవో తదితర పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య పెరగడంతో మరింత విశాలమైన, ఆధునిక క్యాంటీన్ అవసరమైంది.

ఈ నేపథ్యంలో 6వ బెటాలియన్ APSP ప్రాంగణంలో సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీ-ఇంజినీర్డ్ బిల్డింగ్ (PEB) విధానంలో సమీకృత సెంట్రల్ పోలీస్ క్యాంటీన్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్తులో పెరిగే అవసరాలను తీర్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారు. పోలీసు సిబ్బందికి నిత్యావసర వస్తువులు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సంక్షేమ సేవలను ఒకేచోట సమర్థంగా అందించేందుకు ఈ క్యాంటీన్ ఉపయోగపడనుంది.

ఈ సందర్భంగా డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి శ్రేయస్సుకు రాష్ట్ర పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అధికారిక విధుల నిమిత్తం మంగళగిరికి వచ్చే పురుష, మహిళా పోలీసు సిబ్బందికి ‘విహార’, ‘విహారి’ భవనాలు సురక్షితమైన, సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన వసతిని అందిస్తాయని పేర్కొన్నారు.

సమీకృత సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ద్వారా పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు ఆధునికమైన, సౌకర్యవంతమైన సంక్షేమ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మూడు ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను డీజీపీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) శ్రీ ఎన్. మధుసూదన్‌రెడ్డి, ఐపీఎస్, ఐజీపీలు శ్రీ ఎం. రవిప్రకాశ్, ఐపీఎస్ (పి&ఎల్), శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్,(వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్), శ్రీ సీహెచ్. శ్రీకాంత్ ఐపీఎస్ (టెక్నికల్ సర్వీసెస్ & ఆపరేషన్స్), శ్రీ కె.వి. మోహన్‌రావు,ఐపీఎస్ (స్పోర్ట్స్ & వెల్ఫేర్), డీఐజీలు శ్రీ అన్బురాజన్,ఐపీఎస్ (స్పోర్ట్స్ & వెల్ఫేర్), శ్రీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, ఐపీఎస్ (అడ్మిన్)తోపాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story