గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Amaravati: ధవళేశ్వరం బ్యారేజి వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. 13.16 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదు. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక.

Hari Kishan  AP Bureau Chief
Published on: 1 Aug 2026 10:01 PM IST
Amaravati
X

గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

అమరావతి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. అయితే భద్రాచలం వద్ద వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆ నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద పరిస్థితి ఇంకా అప్రమత్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తోంది.

ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.3 అడుగులుగా నమోదైంది. కూనవరం వద్ద నీటిమట్టం 21.40 మీటర్లు, పోలవరం వద్ద 13.19 మీటర్లుగా ఉంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 13.16 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని బట్టి ఈ రాత్రి లేదా ఆదివారం ఉదయం నాటికి ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం దాదాపు 15 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే భద్రాచలం వద్ద వరద క్రమంగా తగ్గుతుండటంతో ఆ ప్రభావం దిగువ ప్రాంతాల్లో కూడా కనిపించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, కాజ్‌వేలు, లోతట్టు రహదారులను దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. వరద ముప్పు ఉన్న గ్రామాల్లో సహాయక చర్యలు, ప్రజల తరలింపు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story