Pithapuram: పిడుగుపాటుకు రైతు మృతి.. పవన్ కళ్యాణ్ విచారం!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లిలో పిడుగుపాటుకు రైతు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Pithapuram: పిడుగుపాటుకు రైతు మృతి.. పవన్ కళ్యాణ్ విచారం!
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని యు.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఆదివారం సాయంత్రం రైతు పి. నూకరాజు తన కుమారుడితో కలిసి పొలం పనుల్లో ఉండగా పిడుగు పడినట్లు కలెక్టర్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రమాదంలో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకుడికి ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నారు.
మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణమే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గాయపడిన నూకరాజు కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. నూకరాజు కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో రైతులు పొలం పనులకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు పిడుగుపాటు ముప్పు ఉన్నప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో పిడుగుపాటు ఘటనలపై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు.. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.




