Chittoor: ఏనుగుల సంచారంపై పవన్ కళ్యాణ్ సమీక్ష!
Chittoor: చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు పరిసరాల్లో ఏనుగుల సంచారంపై అధికారులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుంకీ ఏనుగులతో ఆపరేషన్ చేపట్టాలని ఆదేశం.
Chittoor: ఏనుగుల సంచారంపై పవన్ కళ్యాణ్ సమీక్ష!
Chittoor: చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏనుగుల గుంపును సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రస్తుతం పడిపుట్లబైలు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు కూడా వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు వివరించారు. ఏనుగుల సంచారం కారణంగా పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఒక ఏనుగుల గుంపు రహదారిని దాటి మంగళంపేట బీట్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు పవన్ కళ్యాణ్‌కు వివరించారు. మరో రెండు ఏనుగులు కూడా రహదారి దాటి చిత్తూరు వైపు కదులుతున్నట్లు తెలిపారు. ఏనుగుల కదలికల నేపథ్యంలో పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్ చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పరిస్థితిని బట్టి క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఏనుగుల కదలికలపై హనుమాన్ బృందాలు, అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలకు ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఏనుగులకు కూడా ఎలాంటి హాని కలగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతాల వైపు మళ్లించేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఇక ఏనుగుల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి, నిబంధనల మేరకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణ, మానవ–ఏనుగు ఘర్షణల నివారణ, వన్యప్రాణుల సంరక్షణ—ఈ నాలుగు అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.




