యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ లక్ష్యం
Vijayawada: తెలుగు రాష్ట్రాల యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ లక్ష్యమని కేఎస్‌జీ గ్రూప్ ఛైర్మన్ కంకణాల అభిషేక్ రెడ్డి స్పష్టం చేశారు.
యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ లక్ష్యం
Vijayawada: తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ ప్రధాన లక్ష్యమని కేఎస్‌జీ గ్రూప్ ఛైర్మన్ కంకణాల అభిషేక్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం, పోటీ వేదికలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు స్వాగ్ ట్రోఫీలో భాగంగా గురువారం విజయవాడలోని వీ.ఆర్. సిద్ధార్థ యూనివర్సిటీలో ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు చెందిన తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టు, బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టుతో తలపడింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టు 5-0తో ఘన విజయం సాధించింది. సెట్ల వారీగా 25-11, 25-14, 25-9, 15-5, 16-14 స్కోర్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
మ్యాచ్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి విజేతగా నిలిచిన తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో వాలీబాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఇలాంటి వేదికలు కల్పిస్తున్న జట్టు యజమాని అభిషేక్ రెడ్డిని అభినందించారు.
ఈ సందర్భంగా అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన వాలీబాల్ క్రీడాకారులు ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు లభించక చాలామంది తమ ప్రతిభను నిరూపించుకునే వేదిక కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో తెలుగు బ్లాక్‌హాక్స్ తరఫున యంగ్ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా గత ఆగస్టులో విజయవాడలో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌కు విశేష స్పందన లభించిందన్నారు. అండర్-21 విభాగంలో 105 మంది, సీనియర్స్ ఓపెన్ విభాగంలో 40 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని వివరించారు. ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా సిరిల్ రెడ్డి (వరంగల్), విష్ణువర్ధన్ బాబు (యానం), నమిత్, మునీష్ వెంకటేశన్, దీపక్‌లు పీవీఎల్ సీజన్-5 తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టులో చోటు సంపాదించడం సంతోషంగా ఉందన్నారు. వీరిలో దీపక్ అండర్-21 ట్రయల్స్ నుంచి ఎంపిక కాగా, మిగిలిన నలుగురు సీనియర్స్ ట్రయల్స్ ద్వారా జట్టులోకి వచ్చారని తెలిపారు.
వచ్చే సీజన్లో వీరంతా తెలుగు బ్లాక్‌హాక్స్ తరఫున బరిలోకి దిగనున్నారని వెల్లడించారు. అంతేకాకుండా ఓపెన్ ట్రయల్స్ ద్వారా మరో 12 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి, బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టు తరఫున తెలుగు స్వాగ్ ట్రోఫీలో ఆడే అవకాశం కల్పించామని చెప్పారు.
తమ లక్ష్యం కేవలం ఒక వాలీబాల్ జట్టును నిర్మించడానికే పరిమితం కాదని, తెలుగు రాష్ట్రాల్లో బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడమేనని అభిషేక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న యువతకు చిన్న వయసు నుంచే సరైన శిక్షణ, అనుభవం, ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల క్రీడా ప్రతిభకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తెలుగు బ్లాక్‌హాక్స్ లక్ష్యమని స్పష్టం చేశారు.




