AP: విద్యుత్ ఉద్యోగులకు 4 నెలల్లోనే కారుణ్య నియామకాలు!
AP: విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు 4 నెలల్లోనే కారుణ్య నియామకాలిస్తున్నామని, ఇప్పటివరకు 627 మందికి ఉత్తర్వులిచ్చామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
AP: విద్యుత్ ఉద్యోగులకు 4 నెలల్లోనే కారుణ్య నియామకాలు!
AP: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేసిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు నాలుగు నెలల్లోనే నియామక ఉత్తర్వులు అందిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 627 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందించినట్లు వెల్లడించారు.
సచివాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ జెన్‌కోలో పనిచేస్తూ మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మంది అర్హులకు మంత్రి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులను కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కారుణ్య నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితిని తొలగించి, అర్హతలను పరిశీలించి త్వరితగతిన నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ జెన్‌కో ఎండీ నాగలక్ష్మి, ఐఏఎస్ పాల్గొన్నారు.
7 వేల ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ
విద్యుత్ శాఖలో మానవ వనరుల కొరతను అధిగమించేందుకు సుమారు 7 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు 629 ఏఈ పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేసినా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. విద్యుత్ రంగంలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విద్యుత్ చార్జీలు పెంచలేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ సంస్థలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గృహ, వ్యవసాయ, ఆక్వా, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో విద్యుత్ కొనుగోలు చేసి డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేస్తున్నామని, రాత్రి పీక్ అవర్స్‌లోనూ నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రాధాన్యం
విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. లోఓల్టేజ్ సమస్యను నివారించడంతో పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 132, 220, 400 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామని చెప్పారు. డిస్కంల పరిధిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
పునరుత్పాదక విద్యుత్‌కు ప్రాధాన్యం
పునరుత్పాదక విద్యుత్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని గొట్టిపాటి తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సూర్యఘర్ కనెక్షన్ల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా నాలుగో స్థానానికి చేరిందన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేశామని తెలిపారు.
ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తుగా బొగ్గు నిల్వలను పెంచడంతో పాటు విద్యుత్ ప్లాంట్లలో మరమ్మతులు చేపట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని మంత్రి వివరించారు.
కొత్తగా ఉద్యోగాల్లో చేరే సిబ్బంది పూర్తిస్థాయి శిక్షణ అనంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ రంగంలో భద్రత, బాధ్యత అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజల సంతృప్తి పెరిగేలా, విద్యుత్ సంస్థలకు మంచి పేరు వచ్చేలా ఉద్యోగులు విధులు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతోందని మంత్రి తెలిపారు.




