గుజరాత్‌తో ఏపీ వాణిజ్య బంధానికి కొత్త ప్రతిపాదన....

Amaravati: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ. పోర్టుల అనుసంధానం, గిఫ్ట్ సిటీ తరహా అభివృద్ధి, విజయవాడ ఉత్సవ్‌కు ఆహ్వానం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Sept 2026 12:10 AM IST
Amaravati
X

గుజరాత్‌తో ఏపీ వాణిజ్య బంధానికి కొత్త ప్రతిపాదన....

అమరావతి: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో ఏపీ–గుజరాత్ మధ్య వాణిజ్య, పారిశ్రామిక, పోర్టుల అనుసంధానంపై చర్చించారు. తీరప్రాంత రాష్ట్రాల అభివృద్ధి, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి అంశాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని లోకేష్ ప్రస్తావించారు.

పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ కీలక గేట్‌వేలుగా ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తూ కోస్ట్‌ టు కోస్ట్ లాజిస్టిక్స్, వాణిజ్య కారిడార్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. ప్రైవేట్ పోర్టు కన్సెషన్లు, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణలో గుజరాత్ అనుభవాలను ఏపీతో పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట నాన్‌-మేజర్‌ పోర్టులను ఏపీ అభివృద్ధి చేస్తోందని వివరించారు.

గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో విశాఖపట్నం, అమరావతి ప్రాంతాల్లో ఆధునిక బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని లోకేష్ తెలిపారు. గిఫ్ట్‌ సిటీలో అమలవుతున్న సింగిల్‌ విండో క్లియరెన్స్, డెవలపర్‌ ప్రోత్సాహకాలు, నియంత్రణ వ్యవస్థపై రెండు రాష్ట్రాల మధ్య పరిజ్ఞాన మార్పిడి జరగాలని కోరారు.

ఏపీలో సెమీకండక్టర్, గ్రీన్‌ ఎనర్జీ రంగాలను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక సప్లయ్‌ చైన్‌తో అనుసంధానం చేస్తున్నామని లోకేష్ వివరించారు. కాకినాడలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌, కొప్పర్తి, ఓర్వకల్లు ప్రాంతాల్లో పారిశ్రామిక స్మార్ట్‌ సిటీల అభివృద్ధితో పాటు టెక్నాలజీ ఆధారిత నైపుణ్య వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఇదే సమావేశంలో విజయవాడ ఉత్సవ్‌కు రావాల్సిందిగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను లోకేష్ ఆహ్వానించారు. అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు పున్నమి ఘాట్‌ వేదికగా విజయవాడ ఉత్సవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాల ప్రాధాన్యతను వివరించిన లోకేష్.. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు కూడా హాజరు కావాలని గుజరాత్ సీఎంను కోరారు.

మరోవైపు గుజరాత్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించాలని కూడా లోకేష్ విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌లో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేయాలనే ఏపీ ప్రభుత్వ ఆలోచనను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ, గుజరాత్ మధ్య పోర్టులు, లాజిస్టిక్స్, పారిశ్రామిక పెట్టుబడులు, ఆర్థిక సేవలు, గ్రీన్‌ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించడమే సమావేశం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. మంత్రి నారా లోకేష్ వెంట రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఉన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.