AP: పరిశ్రమల్లో పచ్చని సంకల్పం.. పర్యావరణ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ కార్యాచరణ!

AP: పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ విజయవంతమైంది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 18 Aug 2026 8:01 PM IST
AP
X

AP: పరిశ్రమల్లో పచ్చని సంకల్పం.. పర్యావరణ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ కార్యాచరణ!

AP: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతున్న వేళ.. పర్యావరణ పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన కార్యరూపం దాలుస్తోంది. పరిశ్రమలు వస్తున్నాయి.. పెట్టుబడులు పెరుగుతున్నాయి.. ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి.. అదే సమయంలో ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా చూడాలన్న లక్ష్యంతో గ్రీన్ కవర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమల పరిధిలో 33 శాతం భూభాగాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తొలి దశలో జిల్లాకు ఒక పరిశ్రమ చొప్పున 26 పరిశ్రమలను ఎంపిక చేశారు. ఈ పరిశ్రమల్లో నిర్దేశిత గ్రీన్ కవర్ లక్ష్యాన్ని కేవలం 14 రోజుల్లోనే సాధించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జూలై 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 11న ముగిసింది. రెండు వారాల వ్యవధిలోనే ఎంపిక చేసిన అన్ని పరిశ్రమలు లక్ష్యాన్ని చేరుకోవడం పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక ముందడుగుగా నిలిచింది.

ఈ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలు నాటారు. కేవలం మొక్కలు నాటడంతో కార్యక్రమాన్ని ముగించకుండా.. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా మొక్కల ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చారు. స్థానికంగా పెరిగే దేశీయ జాతులతోపాటు పండ్ల మొక్కలు, సుందరీకరణకు ఉపయోగపడే మొక్కలు, వేప, కానుగ, రావి, నేరేడు వంటి వివిధ రకాల మొక్కలను పెద్ద ఎత్తున నాటారు.

పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో గ్రీన్ బెల్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమల చుట్టూ విస్తృతంగా చెట్లు పెరగడం ద్వారా గాలి నాణ్యత మెరుగుపడటంతోపాటు దుమ్ము, కాలుష్య కణాల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో పారిశ్రామిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమాంతరంగా సాగేందుకు మార్గం సుగమమవుతుంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో పారిశ్రామికీకరణ మరింత వేగం పుంజుకోనుంది. ఈ క్రమంలో పరిశ్రమలు కేవలం ఉత్పత్తి, ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా సామాజిక, పర్యావరణ బాధ్యతను కూడా నిర్వర్తించాలన్న సందేశాన్ని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 33 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని పరిశ్రమలు విధిగా అమలు చేసేలా పీసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

తొలి దశ విజయవంతం కావడంతో మిగిలిన పరిశ్రమల్లోనూ ఇదే తరహా కార్యాచరణను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. పరిశ్రమల యాజమాన్యాలు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఒకవైపు పరిశ్రమలు.. మరోవైపు పచ్చని పరిశ్రమల ప్రాంగణాలు.. ఈ రెండు కలిస్తేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమన్న భావనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను 50 శాతానికి పెంచే దిశగా ప్రతి శాఖ, ప్రతి పరిశ్రమ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. పారిశ్రామిక అభివృద్ధికి పచ్చదనాన్ని జోడిస్తూ.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ఈ పచ్చని కార్యాచరణకు అంతిమ లక్ష్యంగా నిలుస్తోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story