Amaravati: పదవుల కోసం కాదు.. దేశభక్తి కోసం ఢిల్లీలో జనసేన ప్రస్థానం
Amaravati: పదవులు, నిరసనల కోసం కాకుండా దేశ సమైక్యత, దేశభక్తి ఎజెండాగా జనసేన ఢిల్లీలో "సేన ప్రస్థానం" సదస్సు నిర్వహించిందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, తెలిపారు.
Amaravati: పదవుల కోసం కాదు.. దేశభక్తి కోసం ఢిల్లీలో జనసేన ప్రస్థానం
Amaravati: దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి విలువలను యువతలో మరింత బలంగా నాటాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఢిల్లీలో నిర్వహించిన “సేన ప్రస్థానం – జాతీయ సమైక్యత కోసం” కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు జనసేన నేతలు.. సాధారణంగా రాజకీయ పార్టీలు పదవులు, రాజకీయ ప్రయోజనాలు లేదా నిరసన కార్యక్రమాల కోసం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తుంటే, జనసేన మాత్రం దేశ సమగ్రత, పౌర బాధ్యత, దేశభక్తి వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, దేశ భవిష్యత్తు కోసం యువతలో దేశభక్తి భావన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. జాతీయ సమైక్యత సందేశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
ఐదు కీలక అంశాలపై విస్తృత చర్చ
“సేన ప్రస్థానం – జాతీయ సమైక్యత కోసం” కార్యక్రమంలో వికసిత్ భారత్ లక్ష్యం, నేషన్ ఫస్ట్ భావన, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానం, రాజకీయాల్లో జెన్-జీ పాత్ర వంటి ఐదు ప్రధాన అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ అభివృద్ధి, యువత బాధ్యత, రాజకీయాల్లో విలువల ప్రాధాన్యత వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు.
*పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం*
కార్యక్రమ ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్దే కల్యాణ్ ప్రయోజనాలే రాజకీయాల కంటే ముఖ్యమనే సందేశాన్ని ఇచ్చినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో సమాజంలో విభేదాలు సృష్టించకుండా అందరికీ సమాన అభివృద్ధి, సంక్షేమం అందేలా రాజకీయాలు ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు చెప్పారు.
అంతేకాకుండా, జనసేనకు చెందిన పార్లమెంట్ సభ్యులు కేవలం తమ నియోజకవర్గ సమస్యలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కీలక అంశాలపై కూడా చొరవ తీసుకుని మాట్లాడాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు వెల్లడించారు.
*దేశ చరిత్రలో ప్రత్యేక కార్యక్రమం*
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎలాంటి రాజకీయ లాభనష్టాల లెక్కలు లేకుండా, ప్రతి పౌరుడిలో బాధ్యత, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాలకు అతీతంగా జాతీయ సమైక్యతను చాటిచెప్పడం, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
రిజిస్టర్డ్ పార్టీగా ప్రారంభమైన జనసేన, ప్రజల మద్దతుతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎదగడం వెనుక కార్యకర్తలు, అభిమానుల కృషి ఎంతో ఉందని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తి, యువత పాత్ర అనే మూడు అంశాల చుట్టూ సాగిన ఈ సమావేశం జనసేన రాజకీయ దిశను ప్రతిబింబించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




