Amaravati: చిలకలూరిపేట ప్రమాదంపై స్పందించిన మంత్రి మండిపల్లి!
Amaravati: చిలకలూరిపేట ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పిలుపు.
Amaravati: చిలకలూరిపేట ప్రమాదంపై స్పందించిన మంత్రి మండిపల్లి!
Amaravati: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిండు ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో బలైపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టడమే కాకుండా, ఎన్నో ఆశలను ఛిద్రం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. “ప్రయాణాలు గమ్యానికి చేర్చాలి కానీ, ఆఖరి మజిలీకి కాదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన వైద్య సహాయాన్ని తక్షణమే అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా ప్రమాద స్థలంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అవసరమైన వివరాలను సేకరించి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
రోడ్డు భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. డ్రైవర్లు వాహనాలను నిర్లక్ష్యంగా నడపకుండా, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రయాణికులు కూడా భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా మార్గదర్శకాలను పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా నిండు ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం, అధికారులు, వాహనదారులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.




