తోతాపురి రైతుకు అండగా కేంద్రాన్ని కోరిన చంద్రబాబు రూ.281 కోట్ల సాయం కోసం ఢిల్లీకి లేఖ
Amaravati: తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.281 కోట్ల సాయం అందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
తోతాపురి రైతుకు అండగా కేంద్రాన్ని కోరిన చంద్రబాబు రూ.281 కోట్ల సాయం కోసం ఢిల్లీకి లేఖ
అమరావతి: రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసిన సీఎం.. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం (PDPS)ను అమలు చేసి రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కొనుగోళ్లు చేపడుతోందని, దీనికి కేంద్రం కూడా ఆర్థిక సహకారం అందించాలని కోరారు. దీంతో తోతాపురి రైతుల్లో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి.
*ఎగుమతులకు బ్రేక్.. ధరలకు భారీ దెబ్బ*
ఈ ఏడాది తోతాపురి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది అంతర్జాతీయ పరిస్థితులే. సాధారణంగా తోతాపురి మామిడి ఎక్కువగా మ్యాంగో పల్ప్ పరిశ్రమలకు వెళ్తుంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి.
అయితే ఈసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా పల్ప్ ఎగుమతులు తగ్గిపోయాయి. దాంతో పరిశ్రమలు రైతుల నుంచి కొనుగోళ్లు తగ్గించాయి. ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్ ఒక్కసారిగా పడిపోయి తోతాపురి ధరలు కుప్పకూలాయి. రైతులు పెట్టుబడి కూడా రాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
*రాయలసీమ రైతుల జీవనాధారం తోతాపురే*
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.99 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. ప్రతి ఏడాది 52.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. ఇందులో తోతాపురి రకం ప్రత్యేక స్థానం కలిగి ఉంది.
ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో తోతాపురి సాగు విస్తృతంగా ఉంది. ఈ నాలుగు జిల్లాల్లోనే 91,011 హెక్టార్లలో తోతాపురి సాగు సాగుతుండగా, సుమారు 8.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. వేలాది కాదు... లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పంటే ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది.
*పెట్టుబడులు పెరిగాయి.. ఆదాయం తగ్గిపోయింది*
వ్యవసాయంలో ఇప్పటికే ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, రవాణా వ్యయాలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో మంచి దిగుబడి వచ్చినా మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కిలోకు వచ్చే ధర కనీస పెట్టుబడినీ తిరిగి ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
*రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక జోక్యం*
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేసే ప్రణాళిక రూపొందించింది.
అదే సమయంలో రైతులకు కిలోకు అదనంగా రూ.4 ప్రోత్సాహకంగా అందించాలని కూడా నిర్ణయించింది. మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉన్న సమయంలో ఈ అదనపు మొత్తం రైతులకు కొంత ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
*రూ.281 కోట్ల కేంద్ర సాయం కోరిన సీఎం*
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదానితో ఈ భారాన్ని మోయడం కష్టమని భావించిన సీఎం చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ సహకారం కోరారు. మొత్తం రూ.281 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం కింద కేంద్రం నిధులు విడుదల చేస్తే రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అమలు చేయాలని, రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
*PDPS అంటే ఏమిటి..?*
ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం అంటే మార్కెట్‌లో రైతు తన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు.. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న తేడాను ప్రభుత్వం భర్తీ చేసే విధానం. అంటే రైతు పంటను మార్కెట్‌లోనే విక్రయించినా.. ధరలో వచ్చిన లోటును ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తుంది. దీంతో మార్కెట్‌లో ధరలు పడిపోయినా రైతుకు కనీస ఆదాయం లభిస్తుంది.
*రైతుల్లో పెరుగుతున్న ఆశలు*
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించడంతో పాటు ఇప్పుడు కేంద్రానికి కూడా లేఖ రాయడం రైతుల్లో కొత్త ఆశలు కలిగిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల రైతులు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే భారీ ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ రూ.281 కోట్ల సాయం మంజూరైతే తోతాపురి రైతుల ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం ఉంది.
*కేంద్ర నిర్ణయంపై అందరి చూపు*
మామిడి సీజన్ ఇంకా కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. రైతుల పంట ఇప్పటికే మార్కెట్‌కు వస్తోంది. ఈ సమయంలోనే సహాయం అందితే రైతులకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందా..? PDPS అమలుకు ఆమోదం తెలుపుతుందా..? రూ.281 కోట్ల సహాయం మంజూరు చేస్తుందా..? అన్న అంశాలపై ఇప్పుడు రాష్ట్రంలోని తోతాపురి రైతులందరి దృష్టి ఢిల్లీ వైపే నిలిచింది..




