మెగా డీఎస్సీపై వివాదాలకు చెక్.. అధికారుల పూర్తి వివరణ.. హారిజంటల్ రిజర్వేషన్లపై అపోహలే కారణమా?
Mega DSC: మెగా డీఎస్సీ-2025 నియామకాలపై అధికారుల కీలక ప్రకటన. రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, గ్రీవియెన్స్ అంశాలపై వివరణ.
మెగా డీఎస్సీపై వివాదాలకు చెక్.. అధికారుల పూర్తి వివరణ.. హారిజంటల్ రిజర్వేషన్లపై అపోహలే కారణమా?
Mega DSC: మెగా డీఎస్సీ-2025 నియామకాలపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు, అభ్యంతరాలు, అనుమానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. జీఏడీ, విద్యాశాఖ, క్రీడాశాఖ అధికారులు కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డీఎస్సీ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా హారిజంటల్ రిజర్వేషన్ల అమలు విధానం పాత పద్ధతికి భిన్నంగా ఉండటంతో అభ్యర్థుల్లో కొంత గందరగోళం నెలకొన్నట్లు వివరించారు.
అధికారుల ప్రకారం, గత ప్రభుత్వం 2023 ఆగస్టు 2న జారీ చేసిన జీవో నెంబర్ 77 ఆధారంగానే హారిజంటల్ రిజర్వేషన్ల అమలు జరిగింది. కొత్త విధానంలో ఫిక్స్‌డ్ రోస్టర్ పాయింట్లు ఉండవని, డైనమిక్ విధానంలో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. ఈ విధానాన్ని అనుసరించి భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ చేపట్టడం ఇదే మొదటిసారి కావడంతో అపోహలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
*డీఎస్సీలో ఎలాంటి తప్పులు జరగలేదన్న విద్యాశాఖ*
విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ డీఎస్సీ-2025 నియామకాల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్టికల్ రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చే అవకాశం లేదని చెప్పారు. గతంలో కొన్ని పోస్టులను ముందుగానే మహిళలకు కేటాయిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొనేవారని, అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఇప్పుడు ఆ విధానం మారిందని వివరించారు.
కొత్త విధానం డైనమిక్‌గా ఉండటంతో కొందరు అభ్యర్థులు దానిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెందడం సహజమేనని, కానీ దాన్ని నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎవరికి ఏ అనుమానం ఉన్నా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
*సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటే ఎంపిక కాదు*
డీఎస్సీ వివాదాల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవడంపై. దీనిపై కూడా అధికారులు స్పష్టత ఇచ్చారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే కాల్ లెటర్లు జారీ చేశామని, ఎంపిక కోసం కాదని అందులోనే స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు.
అయితే కొందరు కాల్ లెటర్ వచ్చిన వారే ఎంపికైనట్లుగా భావించి అపోహలకు గురయ్యారని చెప్పారు. మరికొందరు కాల్ లెటర్ కూడా అందుకోకపోయినా తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. కట్ ఆఫ్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వారు మాత్రమే కాదు, కట్ ఆఫ్ కంటే ఎక్కువ ర్యాంక్ సాధించిన కొందరు కూడా విధానాన్ని తప్పుపడుతున్నారని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
*33 వేల గ్రీవియెన్సులకు సమాధానం*
డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థుల నుంచి సందేహాలు, ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు 33 వేల గ్రీవియెన్సులను పరిశీలించి వివరణ ఇచ్చామని తెలిపారు.
ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో ఉంచామని, అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని కూడా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించినప్పటికీ నియామక ప్రక్రియను నిలిపివేయాలని ఎక్కడా కోర్టులు ఆదేశించలేదని స్పష్టం చేశారు.
*డిజేబుల్ కోటా ఎంపికలపై కూడా క్లారిటీ*
వికలాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థుల విషయంలో కూడా అధికారులు వివరణ ఇచ్చారు. డిజేబుల్ కోటా కింద దరఖాస్తు చేసిన వారిని మెడికల్ బోర్డుకు పంపించామని, బోర్డు ఇచ్చిన నివేదికల ఆధారంగానే నియామకాలు చేపట్టామని చెప్పారు.అర్హత నిర్ధారణలో ప్రభుత్వం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేదని, వైద్య నిపుణుల అభిప్రాయాల ఆధారంగానే ఎంపికలు జరిగాయని స్పష్టం చేశారు. ఎవరైనా ఎంపికైన తర్వాత ఉద్యోగంలో చేరకపోతే ఆ ఖాళీలను భవిష్యత్ డీఎస్సీ నియామకాల ద్వారా భర్తీ చేసే అవకాశం పరిశీలిస్తామని తెలిపారు.
*స్పోర్ట్స్ కోటాపై వచ్చిన ఆరోపణలకు సమాధానం*
స్పోర్ట్స్ కోటా ఎంపికలపై కూడా గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై శాప్ ఎండీ భరణి వివరణ ఇచ్చారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ప్రభుత్వాలు ఇవ్వవని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన అసోసియేషన్లు, జాతీయ స్థాయిలో ఫెడరేషన్లు జారీ చేస్తాయని తెలిపారు.
నోటిఫికేషన్‌లోనే ఫేక్ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నామని గుర్తు చేశారు. ప్రతి సర్టిఫికెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అర్హత నిర్ణయించామని చెప్పారు. అనర్హులకు అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు.
*421 పోస్టుల్లో 382 మాత్రమే భర్తీ*
స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 421 పోస్టులు అందుబాటులో ఉన్నప్పటికీ, అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 382 పోస్టులనే భర్తీ చేయగలిగామని అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉండటంతో అక్కడి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఎంపికైనట్లు కనిపిస్తోందని వివరించారు.
ఇంటర్ డిస్ట్రిక్ట్ అభ్యర్థుల ఎంపిక కూడా జీవో నెంబర్ 4 ప్రకారమే జరిగిందని, ఇందులో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపారు.
గోల్డ్ మెడల్ ఉన్నా ఎందుకు ఎంపిక కాలేదు?
మీడియా సమావేశంలో కొందరు అభ్యర్థుల కేస్ స్టడీలను కూడా అధికారులు వివరించారు. ముఖ్యంగా గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ తనకు ఉద్యోగం రాలేదని ఆరోపించిన దుర్గయ్య అనే అభ్యర్థి ఉదాహరణను ప్రస్తావించారు.
ఆ అభ్యర్థి తన గోల్డ్ మెడల్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేదని, నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లుగా ఆన్‌లైన్‌లో సమర్పించిన పత్రాలనే పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. అందువల్ల అతని సర్టిఫికెట్‌ను ఎంపిక ప్రక్రియలో పరిగణించడం సాధ్యం కాలేదని చెప్పారు.
*ఇండివిడ్యువల్ ఈవెంట్లకు అధిక ప్రాధాన్యం*
స్పోర్ట్స్ కోటాలో ఎంపికల సమయంలో అనుసరించే ప్రమాణాల గురించి కూడా అధికారులు వివరించారు. టీమ్ ఈవెంట్ల కంటే ఇండివిడ్యువల్ ఈవెంట్లలో సాధించిన విజయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.ఉదాహరణకు, కోకో వంటి జట్టు క్రీడల్లో సాధించిన విజయాల కంటే వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యక్తిగత క్రీడల్లో సాధించిన విజయాలకు అధిక వెయిటేజ్ ఉంటుందని తెలిపారు. ఇది కొత్త నిబంధన కాదని, గతం నుంచి అమలులో ఉన్న విధానమేనని పేర్కొన్నారు.
*అవాస్తవ ప్రచారాలపై ప్రభుత్వ ఆందోళన*
ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం మీద అధికారుల సందేశం ఒక్కటే. డీఎస్సీ-2025 నియామకాలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని, హారిజంటల్ రిజర్వేషన్ల కొత్త విధానంపై సరైన అవగాహన లేకపోవడంతోనే వివాదాలు తలెత్తాయని వారు చెబుతున్నారు. 34 మంది అభ్యర్థుల కేస్ స్టడీలతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా తమ వాదనను వివరించారు.ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాటికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం వల్ల వేలాది మంది అభ్యర్థుల్లో అనవసర ఆందోళన పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, ప్రతి దశ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని మరోసారి స్పష్టం చేశారు.




