విద్వేషాలను ప్రోత్సహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..రావణ్ జోసెఫ్ వ్యాఖ్యలపై జగన్ వైఖరి చెప్పాలి.. మంత్రి ఆనం డిమాండ్..

Amaravati: మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రతిపక్షంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు. జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్. రాజ్యాంగ విలువలను గుర్తు చేశారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 8 July 2026 4:18 PM IST
Amaravati
X

విద్వేషాలను ప్రోత్సహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..రావణ్ జోసెఫ్ వ్యాఖ్యలపై జగన్ వైఖరి చెప్పాలి.. మంత్రి ఆనం డిమాండ్..

అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రతిపక్షం మాత్రం కులాలు, మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన వైఖరిని రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, మత విశ్వాసాలను అవమానించే వ్యాఖ్యలను రాజకీయంగా సమర్థించడం ద్వారా ప్రతిపక్షం సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు.

ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారిస్తుంటే, ప్రజల్లో గందరగోళం సృష్టించేలా కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రజా వేదికలను ఉపయోగించి మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు, సనాతన ధర్మ విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలు ఏ రూపంలో వచ్చినా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని మంత్రి తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించినప్పటికీ, ఆర్టికల్ 19(2) ప్రజా శాంతి, సామాజిక సామరస్యం, ఇతరుల హక్కులు, మత విశ్వాసాల పరిరక్షణ కోసం సహేతుకమైన పరిమితులను కూడా నిర్దేశించిందని గుర్తు చేశారు. అలాగే ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తన మతాన్ని విశ్వసించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు ఉన్నప్పటికీ, ఇతర మతాలను అవమానించడానికి లేదా ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఆ స్వేచ్ఛను ఉపయోగించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు.

ప్రతి వ్యక్తి తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉన్నట్లే, ఇతరుల మత విశ్వాసాలను గౌరవించడం కూడా రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. దళితులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొల్పడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యతేనని, సమాజంలో విభజన సృష్టించడం కాదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ఉద్దేశ్యం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే తప్ప, వాటి పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని అన్నారు.

రాష్ట్ర ప్రజలు అల్లర్లు, విద్వేషాలు కాకుండా అభివృద్ధి, పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఇతరుల మత విశ్వాసాలను అవమానించే హక్కు కాదని, మత విద్వేషాన్ని వ్యాప్తి చేసే లైసెన్స్‌ను రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలపై కేసుల నమోదు, దర్యాప్తు, న్యాయపరమైన చర్యలు పూర్తిగా చట్టబద్ధ ప్రక్రియల ప్రకారమే జరుగుతాయని, ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదని, పోలీసులు, న్యాయస్థానాలు తమ పరిధిలో స్వతంత్రంగా వ్యవహరిస్తాయని తెలిపారు.

సనాతన ధర్మం ప్రపంచానికి "వసుధైక కుటుంబం", "సర్వే జనాః సుఖినో భవంతు", "లోకాః సమస్తాః సుఖినో భవంతు" వంటి విశ్వమానవ సందేశాలను అందించిందని పేర్కొన్న మంత్రి, ప్రేమ, సహనం, సహజీవనం, పరస్పర గౌరవమే సమాజాన్ని ముందుకు నడిపే విలువలని అన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారు సీతారామాంజనేయ ప్రసాద్, కమిషనర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story