వైట్ గట్'పై ఫుల్ అలర్ట్... ఆక్వా రైతులకు ప్రభుత్వం భరోసా,వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు
Amaravati: రొయ్యల సాగును వేధిస్తున్న వైట్ గట్ వ్యాధిపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి తనిఖీలకు ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు.
వైట్ గట్'పై ఫుల్ అలర్ట్... ఆక్వా రైతులకు ప్రభుత్వం భరోసా,వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు
అమరావతి: రాష్ట్రంలో రొయ్యల సాగుకు ముప్పుగా మారుతున్న 'వైట్ గట్' వ్యాధిపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయనే సమాచారం మేరకు మత్స్యశాఖ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. మంత్రి అచ్చెన్న ఆదేశాలతో ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, ఫీడ్, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవిపట్నంతో పాటు ఇతర ఆక్వా ప్రాంతాల్లోనూ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. వ్యాధి వ్యాప్తికి గల కారణాలను శాస్త్రీయంగా గుర్తించి, తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, FDOలు, AIFలు, VFAలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. నమోదిత, నమోదుకాని హేచరీలు, ప్రైవేట్ ఆక్వా ల్యాబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాసిరకం రొయ్య పిల్లలు, నాణ్యతలేని ఫీడ్ విక్రయాలు, తప్పుడు ల్యాబ్ నివేదికలు లేదా నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని మంత్రి హెచ్చరించారు. ప్రతి అనుమానాస్పద చెరువులో PCR పరీక్షలు నిర్వహించి, వ్యాధి మూలాలను గుర్తించి నివారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు కూడా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. "1+1" వంటి ఆకర్షణీయ ఆఫర్లను నమ్మి నాణ్యతలేని రొయ్య పిల్లలను కొనుగోలు చేయొద్దని హెచ్చరించింది. ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవాలని, చెరువు సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే పిల్లలను వదలాలని సూచించింది. బయోసెక్యూరిటీ చర్యలను కచ్చితంగా పాటించాలని, ప్రతి పంట అనంతరం చెరువును ఎండబెట్టి సిల్ట్ తొలగించడం, సున్నం వేయడం, క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే CIBA సూచించిన ఉత్తమ నిర్వహణ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైట్ గట్' నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర స్థాయి శాస్త్రీయ సంస్థలతో సమన్వయం పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ, MPEDA, CIBA, NASPAD, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనిటిక్ రిసోర్సెస్ వంటి సంస్థల సహకారంతో శాస్త్రీయ పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. నవీకరించిన SOPలను రూపొందించి, గ్రామస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏడు రోజుల్లోగా అన్ని జిల్లాల అధికారులు తనిఖీలు, నమూనాల సేకరణ, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
ఇక రొయ్యల రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు, శాస్త్రీయ పర్యవేక్షణ, రైతులకు అవగాహన అనే మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.




