Amaravati: రూ.1,944 కోట్ల నిధులు కనిపించడం లేదా జగన్‌?

Amaravati: రైతుల పంటల కొనుగోలు, నిధుల విడుదలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు సాక్షి ప్రచారాన్ని ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 Oct 2026 5:26 PM IST
Amaravati
X

Amaravati: రూ.1,944 కోట్ల నిధులు కనిపించడం లేదా జగన్‌?

Amaravati: రైతుల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, వాటికి నిధుల విడుదల విషయంలో వైసీపీ అధినేత జగన్‌, సాక్షి మీడియా వాస్తవాలను దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2024–25 ఖరీఫ్‌ నుంచి 2025–26 రబీ వరకు జరిగిన కొనుగోళ్లు, విడుదలైన నిధుల వివరాలను వెల్లడిస్తూ జగన్‌ విమర్శలకు సమాధానమిచ్చారు.

రూ.1,944.43 కోట్ల నిధుల విడుదల

రాష్ట్రంలో 1,50,747 మంది రైతుల నుంచి మొత్తం 2,84,045.60 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లింపుల కోసం నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌ ద్వారా ఏపీ మార్క్‌ఫెడ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1,944.43 కోట్లు విడుదల చేసిందని వివరించారు.

2024–25లో 71,376 మంది రైతుల నుంచి 1,22,970.60 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేయగా, ఇందుకు రూ.821.37 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 2025–26లో 79,371 మంది రైతుల నుంచి 1,61,075 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేసి, రూ.1,123.06 కోట్ల నిధులు విడుదలైనట్లు పేర్కొన్నారు. కందులు, శనగలు, మినుములు, పెసలతోపాటు ఉల్లిపాయలు, పొగాకుకు సంబంధించిన కొనుగోళ్ల వివరాలు కూడా ఉన్నాయని తెలిపారు.

2024–25 ఖరీఫ్‌లో 53,640 మంది రైతుల నుంచి 79,993 మెట్రిక్‌ టన్నుల కందులను రూ.603.95 కోట్ల విలువకు కొనుగోలు చేసినట్లు వివరించారు. 2025–26 ఖరీఫ్‌లో 37,058 మంది రైతుల నుంచి 59,296.70 మెట్రిక్‌ టన్నుల కందులను రూ.474.37 కోట్ల విలువకు సేకరించామన్నారు. అదే ఏడాది రబీలో 32,541 మంది రైతుల నుంచి 83,470.50 మెట్రిక్‌ టన్నుల శనగలను, 7,731 మంది రైతుల నుంచి 14,518.90 మెట్రిక్‌ టన్నుల పెసలను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఖరీఫ్‌ కొనుగోళ్లకు కేంద్ర అనుమతి కోసం ప్రతిపాదనలు

ఖరీఫ్‌–2026 పంట కొనుగోళ్లకు సంబంధించి ఆగస్టు 17నే మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా కనీస మద్దతు ధర విలువలో కనీసం 15 శాతానికి సమానమైన రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.

అదేవిధంగా కేంద్ర నోడల్‌ సంస్థల నుంచి నిధులు లేదా రీయింబర్స్‌మెంట్‌ అందే వరకు కొనుగోళ్లు నిరాటంకంగా కొనసాగించేందుకు, అర్హులైన రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేందుకు రూ.300 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని మార్క్‌ఫెడ్‌ కోరిందన్నారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 23న కేంద్రానికి పంపి కొనుగోళ్లకు అనుమతి కోరినట్లు తెలిపారు.

కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, కొర్రలు, వేరుశనగలను ప్రతిపాదనలో చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆమోద ఉత్తర్వులు రావాల్సి ఉందని స్పష్టం చేశారు.

వాస్తవాలతో చర్చకు రావాలి

మార్క్‌ఫెడ్‌ ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన లేఖ వివరాలను పక్కనపెట్టి ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదన్నట్లు ప్రచారం చేయడం సరికాదని అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించడం, చెల్లింపుల్లో జాప్యం నివారించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జగన్‌, వైసీపీ నేతలు రైతు సంక్షేమంపై విమర్శలు చేసే ముందు అధికారిక గణాంకాలను పరిశీలించాలని సూచించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయకుండా వాస్తవాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.