Amaravati: స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు!

Amaravati: స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. జీఓ నంబర్ 7 జారీ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 28 Sept 2026 5:12 PM IST
Amaravati
X

Amaravati: స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు!

Amaravati: స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమం, స్వర్ణగ్రామం, స్వర్ణవార్డుల శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

ఇప్పటికే 18 కేడర్లలో 14,331 మందికి పదోన్నతులు కల్పించామని మంత్రి తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ పరిధిలో మరో 800 మందికి పైగా పదోన్నతులకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ కేడర్లకు కూడా మూడు వారాల్లోగా పదోన్నతి మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని తెలిపారు.

రికార్డు అసిస్టెంట్ కేడర్‌లో నియమితులైన ఉద్యోగులకు రూ.150 కోట్ల అదనపు ఆర్థిక భారం పడినా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఒకే పోస్టులో ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుందని, దీనికి సంబంధించి ఈ నెల 21న జీఓ నంబర్ 7 జారీ చేసినట్లు ఐటీ, స్వర్ణగ్రామం, స్వర్ణవార్డుల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. సుమారు 1.14 లక్షల మంది అర్హత కలిగిన ఉద్యోగులకు ఈ ప్రయోజనం అందుతుందని చెప్పారు.

సెలవుల విషయంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఆటోమేటిక్ క్యాజువల్ లీవ్ అప్రూవల్ ఫెసిలిటీ తీసుకొచ్చినట్లు భాస్కర్ తెలిపారు. సెలవు దరఖాస్తుపై సంబంధిత అధికారి 24 గంటల్లోగా చర్య తీసుకోకపోతే అది ఆటోమేటిక్‌గా ఆమోదమైనట్లు పరిగణిస్తామని చెప్పారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అర్హత మేరకు ఎర్న్‌డ్ లీవ్, ఇతర సెలవులు, ఇంక్రిమెంట్లు వర్తిస్తాయని వివరించారు.

ఉద్యోగుల పని ఒత్తిడి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నెలా గ్రీవెన్స్ సెల్ నిర్వహించడంతో పాటు అత్యవసర పరిస్థితులు మినహా సెలవు రోజుల్లో ఉద్యోగులకు విధులు కేటాయించకుండా జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

మరణ ప్రయోజనాలను కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు అందిస్తున్నామని భాస్కర్ తెలిపారు. అర్హత ఉన్న కుటుంబాలకు మూడు నెలల్లోగా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 121 మందికి కారుణ్య నియామకాలు కల్పించామని చెప్పారు.

నోషనల్ ఇంక్రిమెంట్ల అంశంపై ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. స్టైపెండ్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడానికి ప్రస్తుతం స్పష్టమైన నిబంధనలు లేనప్పటికీ, తగిన ఉత్తర్వుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

అయితే ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్ కేడర్ కోరడం నిబంధనలకు విరుద్ధమని భాస్కర్ స్పష్టం చేశారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ స్థాయి వేతనం చేరుకోవడం, కేడర్ మార్పు రెండూ వేర్వేరు అంశాలని తెలిపారు.

మరోవైపు అనుమతి లేకుండా విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన ధర్నాపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ హఠాన్మరణంపై కొందరు ఉద్యోగులు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తున్నందున ఆందోళనలకు బదులుగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.