Amaravati: జగన్‌కు క్రెడిట్ జబ్బు ముదిరిపోయింది మంత్రి సంధ్యారాణి ఎద్దేవా!

Amaravati: ఇతరులు చేసిన పనులకు క్రెడిట్ తీసుకోవడం మాజీ సీఎం జగన్‌కు అలవాటుగా మారిందని, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటున్నారని మంత్రి విమర్శలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 3 Sept 2026 10:59 AM IST
Amaravati
X

Amaravati: జగన్‌కు క్రెడిట్ జబ్బు ముదిరిపోయింది మంత్రి సంధ్యారాణి ఎద్దేవా!

Amaravati: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇతరులు చేసిన పనులకు క్రెడిట్‌ తీసుకునే జబ్బు ముదిరిపోయిందని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. ఈ వ్యాధికి వైద్యం చేసే డాక్టర్‌ కూడా లేరని, ఈ వ్యాధికి తొలి బాధితుడు జగన్‌నేనని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమంపైనా జగన్‌ ఉదయం అవినీతి, అక్రమాలంటూ ఆరోపణలు చేయడం.. అదే పనిని సాయంత్రానికి తన ఘనతగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రభుత్వం ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే దానిపై విమర్శలు చేయడం, అభివృద్ధి పనులు ప్రారంభిస్తే అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయడం జగన్‌కు అలవాటుగా మారిందని మంత్రి అన్నారు. అయితే కొద్దిసేపటికే అదే కార్యక్రమం తన హయాంలో ప్రారంభమైందని, తన వల్లే సాధ్యమైందని చెప్పుకోవడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. జగన్‌ మాట్లాడే తీరు మార్చుకోవాలని.. లేదంటే మందుల మోతాదు పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ జగన్‌ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని సంధ్యారాణి మండిపడ్డారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే దాని ఘనతను కూడా జగన్‌ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం, గూగుల్‌ ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం తన వల్లే జరిగిందన్నట్లు జగన్‌ చెప్పుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎవరి హయాంలో ఏ పని జరిగింది. ఎవరు ఏం చేశారన్న విషయంపై వారికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. కేవలం ప్రచారం చేసుకోవడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేశారు.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి బదులు కొల్లగొట్టడం, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేయడమే ఆయన ఘనత అని సంధ్యారాణి విమర్శించారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాలు వంటి అనేక రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

జగన్‌ చెప్పుకునే ఇలాంటి ఘనతలు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి, వాటి ఫలితాలను వారికి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధి పనులకు ఎవరు క్రెడిట్‌ తీసుకున్నారన్నది కాకుండా.. ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్నదే ముఖ్యమని చెప్పారు.

జగన్‌ బాధ్యతారహితంగా చేసే వ్యాఖ్యల వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉండాలని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని సంధ్యారాణి హితవు పలికారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story