Amaravati: ప్రముఖ నటి షావుకారు జానకి మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దిగ్భ్రాంతి!

Amaravati: పద్మశ్రీ ‘షావుకారు’ జానకి మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం. ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటని, నటన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని వెల్లడి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 21 Aug 2026 5:49 PM IST
Amaravati
X

Amaravati: ప్రముఖ నటి షావుకారు జానకి మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దిగ్భ్రాంతి!

Amaravati: ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘షావుకారు’ జానకి మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు, కళా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

‘షావుకారు’ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించి, అదే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న షావుకారు జానకి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి గుర్తుచేశారు. రాజమహేంద్రవరంలో జన్మించిన ఆమె దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, తనదైన సహజ నటనతో ప్రేక్షకులను అలరించారని తెలిపారు.

విభిన్నమైన పాత్రలను అవలీలగా పోషిస్తూ నటిగా తన ప్రత్యేకతను చాటుకున్న షావుకారు జానకి, దక్షిణ భారత సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. కథానాయికగా, తల్లిగా, అక్కగా, అమ్మమ్మగా, ఇతర కీలక పాత్రల్లో నటిస్తూ అనేక తరాల ప్రేక్షకులకు చేరువయ్యారని పేర్కొన్నారు. ఆమె అభినయం, హావభావాలు, సంభాషణల పలుకుబడి నేటి నటీనటులకు కూడా స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు.

తెలుగు చిత్రసీమలో తన ప్రతిభతో, విలక్షణమైన నటనతో చెరగని ముద్ర వేసిన షావుకారు జానకి ఇక లేరన్న వార్త తీవ్రంగా కలిచివేసిందని కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సేవలను, కళారంగానికి అందించిన విశిష్టమైన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

షావుకారు జానకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, సహచర కళాకారులకు, లక్షలాది మంది అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story