Atchannaidu: మెగా డీఎస్సీపై ఆరోపణలకు ఆధారాలతో సమాధానం: అచ్చెన్నాయుడు
Atchannaidu: మెగా డీఎస్సీ అభ్యర్థులను ఫేక్ అనడం దుర్మార్గం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. 148 రోజుల్లో 16,347 పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందని వెల్లడి.
Atchannaidu: మెగా డీఎస్సీపై ఆరోపణలకు ఆధారాలతో సమాధానం: అచ్చెన్నాయుడు
Atchannaidu: కష్టపడి చదివి, క్రీడల్లో ప్రతిభ చాటి నిబంధనల ప్రకారం మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ‘ఫేక్’ అంటూ అవమానించడం సరికాదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆధారాలను సంబంధిత సంస్థల ముందు ఉంచడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే రాజకీయ విభేదాలు భౌతిక ఘర్షణలకు దారితీయకూడదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులపై దాడులు జరిగాయన్న ఆరోపణలు తీవ్రమైనవని, ఘటనలో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకతకు ఎలాంటి లోటు లేదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. నోటిఫికేషన్, పరీక్షలు, ఆన్సర్ కీలు, మెరిట్ జాబితాలు, అభ్యంతరాల స్వీకరణ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, తుది ఎంపిక వరకు నిబంధనల ప్రకారమే ప్రక్రియ సాగిందన్నారు.
స్పోర్ట్స్ కోటాపై కూడా అనవసరమైన అనుమానాలు సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కల్పించడం కొత్త విధానం కాదన్నారు. ఏదైనా వ్యక్తిగత సర్టిఫికెట్‌పై అనుమానం ఉంటే దానిని పరిశీలించి తప్పు తేలితే చర్యలు తీసుకోవచ్చని, కానీ మొత్తం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ‘ఫేక్’గా చిత్రీకరించడం సరికాదన్నారు. బ్రిడ్జ్ క్రీడకు సంబంధించిన అంశాలను కూడా వాస్తవాలు పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని సూచించారు.
ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంపై కూడా అచ్చెన్నాయుడు ప్రశ్నలు లేవనెత్తారు. 2018 డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ కాగా, 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరిగాయని తెలిపారు. మొత్తం 6,807 మంది ఏడు పేపర్లను రాశారని, అనంతరం మూల్యాంకన ప్రక్రియపై వివాదాలు తలెత్తాయని పేర్కొన్నారు. SIT పరిశీలించిన 736 మంది అభ్యర్థుల రికార్డుల్లో 718 వాల్యూషన్ స్లిప్స్ కరెక్షన్స్ లేదా alterations గుర్తించినట్లు మంత్రి తెలిపారు. సిగ్నేచర్ mismatches, ఓవర్ రైటింగ్, correction fluid వినియోగం వంటి అంశాలపై కూడా దర్యాప్తులో ప్రస్తావన వచ్చిందన్నారు.
ఈ అంశాలపై అప్పటి ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డీఎస్సీపై ఆరోపణలు చేసే ముందు గతంలో జరిగిన నియామక ప్రక్రియలపై కూడా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.




