AP: ఏపీలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లు: కొండపల్లి శ్రీనివాస్!
AP: రైతుల ఆదాయం పెంపు, ఎఫ్పీఓల బలోపేతమే లక్ష్యంగా సెర్ప్ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
AP: ఏపీలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లు: కొండపల్లి శ్రీనివాస్!
AP: రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) వ్యాపారపరంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మునగ విలువ ఆధారిత ప్రాసెసింగ్ కార్యక్రమాన్ని విస్తరిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
రైతులు కేవలం మునగ ఆకులను విక్రయించడంతోనే పరిమితం కాకుండా.. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ ప్రక్రియల్లోనూ భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లా వీరబల్లి, తిరుపతి జిల్లా యర్రావారిపాలెంలో ఏర్పాటు చేసిన మునగ ప్రాసెసింగ్ యూనిట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు యూనిట్ల అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఇతర ప్రాంతాల్లోనూ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
స్థానిక వాతావరణ పరిస్థితులు, మునగ సాగు విస్తీర్ణం, రైతుల ఆసక్తి, ముడిసరుకు లభ్యతతో పాటు సంబంధిత FPOల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త యూనిట్లను ఎంపిక చేస్తున్నట్లు మంత్రి వివరించారు. తమిళనాడులోని పేరియకుళం హార్టికల్చర్ కళాశాల, పరిశోధనా సంస్థ నుంచి అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన మునగ విత్తనాలను సేకరించి రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాసెసింగ్, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించేందుకు రైతులు, FPO ప్రతినిధులకు ప్రత్యేక అధ్యయన పర్యటనలు కూడా నిర్వహిస్తున్నామన్నారు.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో జీవనోపాధుల నిధుల సాయంతో ఏర్పాటు చేసిన మునగ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ప్రస్తుతం రోజుకు 250 కిలోల మునగ పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ యూనిట్‌ను రూ.86.80 లక్షలతో ఏర్పాటు చేశామని, సుమారు 300 ఎకరాల నుంచి మునగ ఆకులను సేకరిస్తున్నట్లు చెప్పారు.
మునగ సాగుతో రైతులకు గిట్టుబాటు ఆదాయం లభించేలా FPOల ద్వారా కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతు స్థాయిలో ఒక కిలో మునగాకు ఉత్పత్తికి సుమారు రూ.10 ఖర్చవుతుండగా.. FPOలు రైతుల నుంచి కిలో రూ.15 చొప్పున కొనుగోలు చేస్తున్నాయని వివరించారు. దీంతో రైతుకు కిలోకు రూ.5 వరకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పథకం కింద ఎకరాకు రూ.1.30 లక్షల వరకు అభివృద్ధి సహాయం అందించే అవకాశం ఉందన్నారు. మునగ సాగు ద్వారా రైతులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నికర ఆదాయం లభించే అవకాశం ఉందని తెలిపారు.
మునగ పొడికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ డిమాండ్ ఉందని మంత్రి పేర్కొన్నారు. పోషకాహార ఉత్పత్తులు, హెల్త్ డ్రింక్స్, హెర్బల్ టీలు, న్యూట్రాస్యూటికల్స్, ఆయుర్వేద ఉత్పత్తుల్లో మునగ పొడిని విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్‌తో పాటు ఈ-కామర్స్ వేదికల ద్వారా మునగ ఉత్పత్తులను మార్కెట్ చేసేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.




