Kondapalli Srinivas: విదేశాల్లో ఉన్నా తెలుగు మూలాలు, భాషా సంస్కృతులను మరువొద్దు: మంత్రి

Kondapalli Srinivas: మలేషియా పెనాంగ్‌లో జరిగిన ఏపీటీఎఫ్ కాన్ఫరెన్స్-2026లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 30 Aug 2026 7:58 PM IST
Kondapalli Srinivas
X

Kondapalli Srinivas: విదేశాల్లో ఉన్నా తెలుగు మూలాలు, భాషా సంస్కృతులను మరువొద్దు: మంత్రి

Kondapalli Srinivas: విదేశాల్లో ఎంతగా ఎదిగినా తెలుగు మూలాలు, భాషా సంస్కృతులను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మలేషియా పర్యటనలో భాగంగా రెండో రోజు పెనాంగ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ (APTF) కాన్ఫరెన్స్–2026కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు భాష, సంస్కృతి, ప్రవాసాంధ్రుల పాత్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వంటి అంశాలపై ఆయన మాట్లాడారు.

పెనాంగ్‌లో APTF కాన్ఫరెన్స్–2026 ఘనంగా ప్రారంభమైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగు సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో APTF ఏర్పాటు కావడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. భౌగోళికంగా వేర్వేరు దేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు వారందరినీ భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఒకే కుటుంబంగా కలుపుతున్నాయని అన్నారు.

విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రవాసంలో ఉన్న ప్రతి తెలుగు ఇల్లు ఒక చిన్న తెలుగు బడిగా మారాలని ఆకాంక్షించారు. కొత్త తరానికి తెలుగు భాషపై ఆసక్తి పెంచేందుకు స్థానికంగా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు భాషా బోధనకు సంబంధించిన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రవాసాంధ్రుల అనుభవం, నైపుణ్యం, పెట్టుబడులు కీలకంగా మారతాయని చెప్పారు. మాతృభూమితో ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని ఇకపై అభివృద్ధి భాగస్వామ్యంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి ఆహ్వానించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు కలగడంతో పాటు యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రవాస పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.

యువత కోసం ప్రపంచస్థాయిలో స్టార్టప్, మెంటార్‌షిప్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. విదేశాల్లో ఉన్న నిపుణులు తమ అనుభవాలను యువతతో పంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతకు అంతర్జాతీయ అవకాశాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని అన్నారు.

ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారంలో APNRTS బలమైన వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, వారి నైపుణ్యాలను రాష్ట్ర అభివృద్ధితో అనుసంధానించే దిశగా APNRTS కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

కాగా, మలేషియా తెలుగు యువ కళాకారులు ప్రదర్శించిన ఉత్తరాంధ్ర శైలి కోలాట భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు జానపద కళలను విదేశాల్లోనూ యువత అద్భుతంగా ప్రదర్శించడం స్ఫూర్తిదాయకమని మంత్రి అభినందించారు. తెలుగు భాషతో పాటు మన కళలు, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ప్రవాస యువత చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story