AP: పెన్షన్లపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు: మంత్రి శ్రీనివాస్!
AP: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు.
AP: పెన్షన్లపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు: మంత్రి శ్రీనివాస్!
AP: సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పెన్షన్లను ఏటా కేవలం రూ.250 చొప్పున పెంచుతూ కాలయాపన చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీ మేరకు పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిందని తెలిపారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపు ఫైలుపై రెండో సంతకం చేశారని మంత్రి తెలిపారు. జూలై 1 నుంచే రూ.4 వేల పెన్షన్ అమల్లోకి వచ్చిందన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో పెన్షన్ల కోసం రూ.91 వేల కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం 26 నెలల్లోనే రూ.73 వేల కోట్లను లబ్ధిదారులకు అందించిందని పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీని పేదల సేవా దినోత్సవంగా భావిస్తూ సీఎం స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు.
పెన్షన్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. గతంలో వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే ‘పర్మనెంట్ మైగ్రేషన్’ పేరుతో కార్డు రద్దు చేసే పరిస్థితి ఉండేదన్నారు. వలస వెళ్లిన పేదలకు ఇబ్బందులు లేకుండా మూడు నెలల పెన్షన్‌ను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. పెన్షనర్ మరణిస్తే జీవిత భాగస్వామికి వెంటనే స్పౌస్ పెన్షన్ అందించే విధానాన్ని అమలు చేశామని, ఇప్పటివరకు సుమారు 2.60 లక్షల స్పౌస్ పెన్షన్లు మంజూరు చేశామని వెల్లడించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ పొందలేకపోయిన సుమారు లక్ష మంది మహిళలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, డయాలసిస్ బాధితుల పెన్షన్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, దీర్ఘకాలిక వ్యాధులు, మంచానికే పరిమితమైన వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచామని తెలిపారు.
ఆరు లక్షల పెన్షన్లు తొలగించామంటూ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వివిధ నిబంధనల పేరుతో సుమారు 10 లక్షల పెన్షన్లు రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 26 నెలల్లో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పేరుతో పెన్షన్లు తొలగించలేదని, నిర్దిష్ట ఫిర్యాదులపై విచారణ అనంతరం కేవలం 3 వేల వరకు మాత్రమే రద్దు చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62.10 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం సుమారు 4.50 లక్షల మంది లబ్ధిదారులు మరణించడమేనన్నారు.
కొత్త పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఏడు పనిదినాల గడువు ఇచ్చామని, దరఖాస్తులతో పాటు క్షేత్రస్థాయి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా కొనసాగుతోందన్నారు. రెండు రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 2.30 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా పెన్షన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. పెన్షన్లకు కొత్త నిబంధనలు విధించారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, పాత నిబంధనల ప్రకారమే దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు.
దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి పేర్కొన్నారు. ఏటా సుమారు రూ.33 వేల కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల కోసం నాలుగు రెట్లు అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేసి నష్టాన్ని సరిదిద్దిందని మంత్రి విమర్శించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనకాపల్లి జిల్లాకు పోలవరం జలాలను తరలించామని తెలిపారు.
అర్హులైన వారికి పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, పట్టణ ప్రాంతాల్లో హౌస్ టాక్స్, రెంటల్ అసెస్‌మెంట్ నంబర్ వంటి ఇబ్బందులను తొలగించామని చెప్పారు. వితంతు పెన్షన్ దరఖాస్తులను రైస్‌కార్డులో భర్త పేరు డీలింక్ కాలేదనే కారణంతో తిరస్కరించవద్దని అధికారులకు ఆదేశించామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.




