Amaravati: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నాం..మంత్రి లోకేష్!
Amaravati: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Amaravati: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నాం..మంత్రి లోకేష్!
Amaravati: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నేతలు ఎదురుచూస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి బీసీలే వెన్నుముక అని స్పష్టం చేసిన లోకేష్.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. న్యాయస్థానం తీర్పు వెలువడిన తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు నిర్ణయం కీలకమని లోకేష్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. అక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలపై స్పష్టత వస్తుందని తెలిపారు.
ఇదే సమయంలో వైసీపీపై మంత్రి లోకేష్ విమర్శలు చేశారు. నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించడంపై స్పందిస్తూ.. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకముందే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై స్పష్టత లేకుండానే అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వ విధానమని లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండదన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని చెప్పారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల్లోనూ కసరత్తు మొదలైంది. రిజర్వేషన్లపై కోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థుల ఎంపిక, స్థానాల సర్దుబాటు, ఎన్నికల వ్యూహంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపైనే ప్రస్తుతం అన్ని పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది.




