Nara Lokesh: మంత్రి నారా లోకేష్ చొరవతో తల్లిదండ్రుల చెంతకు బాలుడు!
Nara Lokesh: సోషల్ మీడియాలో వైరలైన గొర్రెల కాపరి బాలుడు రామయ్య కథ సుఖాంతం మంత్రి నారా లోకేష్ తక్షణ స్పందనతో ఆచూకీ లభ్యం చదువు, వైద్యం, ఇల్లు మంజూరు చేస్తామని హామీ.
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ చొరవతో తల్లిదండ్రుల చెంతకు బాలుడు!
Nara Lokesh: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన గొర్రెల కాపరి బాలుడు రామయ్య కథ సుఖాంతమైంది. నిన్నటి నుంచి బాలుడు రామయ్యకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ కావడంతో.. అతని ఆచూకీపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో స్పందించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. బాలుడిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి బాలుడు రామయ్య ఆచూకీని గుర్తించాయని లోకేష్ తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆగమేఘాలపై స్పందించి.. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారని చెప్పారు. బాలుడి కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
రామయ్యను రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్పించి.. అతని చదువుకు అవసరమైన సహకారం అందించనున్నట్లు లోకేష్ వెల్లడించారు. అదే సమయంలో బాలుడి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో.. అవసరమైన వైద్యం చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుటుంబానికి అండగా నిలిచేలా బాలుడి తల్లికి స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
ఇక రామయ్య కుటుంబానికి సొంత ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. విద్య, వైద్యం, ఉపాధి, నివాసం.. ఇలా కుటుంబానికి అవసరమైన అన్ని అంశాల్లో ప్రభుత్వ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. బాలుడి భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో పాటు.. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహాయం చేస్తామని తెలిపారు.
రామయ్య ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. బాలుడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సమాచారం పంచుకున్న ప్రతి ఒక్కరి స్పందన కూడా రామయ్యను గుర్తించడంలో ఉపయోగపడిందని చెప్పారు.
ముఖ్యంగా.. బాలుడి ఆచూకీ కోసం వెంటనే స్పందించి, ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేస్తూ రామయ్యను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
సోషల్ మీడియాలో మొదలైన ఆందోళన.. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో సుఖాంతమైందని లోకేష్ పేర్కొన్నారు. రామయ్యను ఇంటికి చేర్చడమే కాకుండా.. అతని చదువు, తల్లిదండ్రుల ఆరోగ్యం, కుటుంబ జీవనోపాధి, సొంత ఇంటి అంశాల్లోనూ ప్రభుత్వం అండగా నిలవనుందని తెలిపారు.




