సాగునీటిపై సర్కార్ ప్రత్యేక దృష్టి.. ఖరీఫ్ ముందు కాలువలపై ఫోకస్

ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ఏపీలో సాగునీటి పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక సమీక్ష.

Hari Kishan  AP Bureau Chief
Published on: 15 May 2026 3:16 PM IST
Minister Nimmala Ramanaidu
X

సాగునీటిపై సర్కార్ ప్రత్యేక దృష్టి.. ఖరీఫ్ ముందు కాలువలపై ఫోకస్

Minister Nimmala Ramanaidu: ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న వేళ సాగునీటి వ్యవస్థపై జలవనరుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

*ఓఅండ్ఎం పనులకు రూ.708 కోట్ల భారీ కేటాయింపు*

కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఓఅండ్ఎం పనుల కోసం రెండు విడతలుగా రూ.708 కోట్లు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాగునీటి వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం నిధుల కేటాయింపులో వెనుకడుగు వేయడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కాలువల శుభ్రతకు రూ.397 కోట్ల విడుదల

కాలువల్లో తూడు తొలగింపు, గుర్రపుడెక్క నిర్మూలన, పూడికతీత, అత్యవసర మరమ్మత్తుల కోసం రూ.397 కోట్లు మంజూరు చేశారు. కాలువల్లో అడ్డంకులు తొలగితేనే నీటి ప్రవాహం మెరుగై చివరి ఆయకట్టుకు సాగునీరు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది..

*గత పాలనపై మంత్రి విమర్శలు*

గత ఐదేళ్లలో కాలువల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. తూడు, పూడికతీత వంటి కనీస పనులు కూడా చేయకపోవడంతో నీటి ప్రవాహ వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు..

*సాగునీటి సంఘాలకు పెద్దపీట*

మొత్తం 6,502 పనుల్లో 5,943 పనులు సాగునీటి సంఘాల ద్వారానే చేపట్టడం మరో కీలక అంశంగా మారింది. స్థానిక స్థాయిలో రైతుల భాగస్వామ్యంతో పనులు వేగంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అత్యవసర పనులకు ఫాస్ట్ ట్రాక్

రూ.10 లక్షలు దాటే అత్యవసర పనులకు ఆలస్యం లేకుండా కేవలం 7 రోజుల్లో షార్ట్ టెండర్లు పిలిచేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..

*జలధారతో సమన్వయం.. భూగర్భ జలాలపై ఫోకస్*

జలధార కార్యక్రమాన్ని ఓఅండ్ఎం పనులతో అనుసంధానం చేసి భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వర్షపు నీటి నిల్వ, నీటి వినియోగ సామర్థ్యం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

*ఈ నెలలో కీలక సమావేశం*

జలధార కార్యక్రమంపై కేంద్ర జలశక్తి మంత్రి, సీఎం చంద్రబాబు, కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ఈ నెలలో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీని ద్వారా రాష్ట్ర సాగునీటి వ్యవస్థపై మరిన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

నిధులు విడుదలయ్యాయి.. పనులకు గడువులు నిర్ణయించారు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. ఇప్పుడు ఖరీఫ్ నాటికి పనులు పూర్తవుతాయా? రైతుకు ప్రయోజనం చేకూరుతుందా? అనేదే అసలు పరీక్ష.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story