Vijayawada: ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్‌ది మరో తప్పుడు ప్రచారం..మంత్రి వై. సత్యకుమార్!
Vijayawada: ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు సరికాదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆధారాలుంటే చట్టబద్ధంగా చూపాలని డిమాండ్.
Vijayawada: ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్‌ది మరో తప్పుడు ప్రచారం..మంత్రి వై. సత్యకుమార్!
విజయవాడ: ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్, రాహుల్‌గాంధీ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరుస రాజకీయ పరాజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై అనుమానాలు కలిగించే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ నాలుగు గోడల మధ్య జరిగేది కాదని సత్యకుమార్ అన్నారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన తర్వాతే జాబితా రూపొందుతుందని తెలిపారు. ఎస్ఐఆర్‌లో ముసాయిదా జాబితా విడుదల చేసిన అనంతరం కూడా ప్రజలకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, సవరణలకు అవకాశం ఉంటుందని చెప్పారు.
కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, ఓటర్ల తొలగింపుపై అభ్యంతరాలకు ఫారం–7, వివరాల సవరణలు, చిరునామా మార్పులకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన ప్రక్రియను వినియోగించకుండా ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఎస్ఐఆర్‌లో 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారన్న ప్రచారంపైనా మంత్రి స్పందించారు. వివిధ రాష్ట్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగింపునకు వచ్చినప్పటికీ, వాటన్నింటినీ తుది తొలగింపులుగా పేర్కొనడం సరికాదన్నారు. మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు, డూప్లికేట్ ఎంట్రీలు, ఆచూకీ లేని ఓటర్ల వివరాలను పరిశీలించే ప్రక్రియలో భాగంగానే పేర్లు ముసాయిదాలో తొలగింపునకు వచ్చినట్లు తెలిపారు.
‘ఓటు చోరీ జరిగిందని ఆరోపించడం కాదు.. ఆధారాలు చూపాలి’ అని సత్యకుమార్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్‌పై అభ్యంతరాలు ఉన్నవారు ఆధారాలతో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని సూచించారు. బీహార్ ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఉందని పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
ఫారం–6ను మార్చేశారన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ఎన్నికల సంఘం పోర్టల్‌లో కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, తొలగింపులకు ఫారం–7, సవరణలకు ఫారం–8 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎస్ఐఆర్‌లో కొత్త ఓటర్లకు అదనపు డిక్లరేషన్ విధానం అమలులోకి వచ్చిన విషయాన్ని మాత్రమే ఎన్నికల సంఘం వివరించిందన్నారు.
యువత ఓట్ల తొలగింపుపై జరుగుతున్న ప్రచారాన్ని కూడా మంత్రి తప్పుబట్టారు. ఎస్ఐఆర్ తర్వాత 18–28 ఏళ్ల వయసు విభాగంలో కోట్లాది కొత్త ఓటర్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం వివరాలను ఉటంకిస్తూ వార్తా సంస్థలు వెల్లడించాయని చెప్పారు. ప్రస్తుతం ఈ వయసు విభాగంలో 17.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
ఎన్నికల కమిషనర్ల మధ్య ఏకాభిప్రాయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపైనా ఆధారాలు చూపాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజల్లో అనుమానాలు సృష్టించడమేనన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాలని, అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.
సమావేశంలో బీజేపీ హెడ్‌క్వార్టర్స్ ఇన్‌ఛార్జి ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు.




