Amaravati: బీసీ గురుకులాల శాశ్వత భవనాలకు రూ.500 కోట్లు మంత్రి సవిత!
Amaravati: బీసీ గురుకులాల శాశ్వత భవనాలకు రూ.500 కోట్ల సాస్కి నిధులు, అసంపూర్తి భవనాలకు రూ.80 కోట్లు కేటాయించినట్లు మంత్రి సవిత అసెంబ్లీలో తెలిపారు.
Amaravati: బీసీ గురుకులాల శాశ్వత భవనాలకు రూ.500 కోట్లు మంత్రి సవిత!
Amaravati: బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బీసీ గురుకులాలను బలోపేతం చేయడంతో పాటు శాశ్వత భవనాల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇందులో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు రూ.500 కోట్ల సాస్కి నిధులతో శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గురుకుల భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు మరో రూ.80 కోట్లు కేటాయించింది.
శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత.. బీసీ గురుకులాల్లో విద్యకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రస్తావించారు. రాష్ట్రంలో గురుకుల విద్యకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక వసతులను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వీటిలో ఐదు రాయలసీమలో, మరో ఐదు ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే బీసీ బాలికల విద్యలో మధ్యలోనే చదువు మానేయడాన్ని అరికట్టేందుకు ఆరు బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. పదో తరగతి తర్వాత కూడా అదే విద్యా వాతావరణంలో ఉన్నత విద్య కొనసాగించే అవకాశం కల్పించడం ద్వారా బాలికల డ్రాపౌట్లను తగ్గించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
ఆగిపోయిన భవనాలకు మళ్లీ కదలిక
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కేవలం 32 బీసీ గురుకులాలు మాత్రమే ఉండగా, 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 75 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిందని మంత్రి గుర్తు చేశారు. వాటిలో 25 ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం అప్పట్లో రూ.40 కోట్లు మంజూరు చేశారని, 70 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అసంపూర్తి నిర్మాణాలపై దృష్టి పెట్టి రూ.80 కోట్లు కేటాయించింది. గోనబావి, మడకశిర, రొద్దం, పులివెందుల తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించింది. ఆరు నెలల్లో ఈ భవనాలను పూర్తి చేసి బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మాణానికి రూ.9.75 కోట్ల అంచనాలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.
హాస్టళ్లకు మౌలిక వసతుల మెరుగుదల
రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లలో సుమారు 90,676 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్, జిల్లా ఖనిజ నిధులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన హాస్టళ్లను ప్రత్యామ్నాయ భవనాలకు తరలించామని, మరికొన్ని భవనాలను గుర్తించి త్వరలోనే షిఫ్ట్ చేస్తామని తెలిపారు.
హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, దోమతెరలు ఏర్పాటు చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ విధానంతో విద్యార్థులు, వార్డెన్ల హాజరును పర్యవేక్షిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం 1,291 మంది సిబ్బందితో పాటు 142 మంది కుక్‌లు, కమాటీలను నియమించారు. 2026-27 బడ్జెట్‌లో హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు కేటాయించారు.
బీసీ గురుకులాలు, హాస్టళ్లను కేవలం విద్యార్థులకు వసతి కల్పించే కేంద్రాలుగా కాకుండా నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, భద్రతతో కూడిన విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయితే బీసీ విద్యార్థులకు దీర్ఘకాలికంగా మెరుగైన విద్యా వాతావరణం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.




