Mangalagiri: లోకేష్‌పై మాట్లాడే అర్హత కొడాలి నాని కి లేదు.. మంత్రి సుభాష్!

Mangalagiri: నారా లోకేష్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్.

Hari Kishan  AP Bureau Chief
Published on: 12 Sept 2026 4:36 PM IST
Mangalagiri
X

Mangalagiri: లోకేష్‌పై మాట్లాడే అర్హత కొడాలి నాని కి లేదు.. మంత్రి సుభాష్!

Mangalagiri: క్యాసినోలు నడిపే కొడాలి నానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చదువు, సంస్కారం లేని కొడాలి నాని లోకేష్‌పై ఏకవచనంతో మాట్లాడటం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్షతో ఎమ్మెల్యేగా ఎదిగి, ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారని ఆరోపించారు.

ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సుభాష్ సవాల్ చేశారు. సభకు రాకుండా ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వైసీపీ అధినేత జగన్ కోసం కొడాలి నాని వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులు ఒక్క సమీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు.

దావోస్ పర్యటనల విషయంలోనూ వైసీపీ నేతలపై మంత్రి విమర్శలు చేశారు. గతంలో దావోస్ వెళ్లిన వైసీపీ మంత్రులు రాష్ట్రానికి పెద్దగా పెట్టుబడులు తీసుకురాలేకపోయారని ఆరోపించారు. అదే నారా లోకేష్ దావోస్ పర్యటన ద్వారా గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్‌తో పాటు ఐటీ రంగంలో భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

వల్లభనేని వంశీ, పేర్ని నాని వంటి నేతల అవినీతి, దోపిడీపై కొడాలి నాని మాట్లాడటం విడ్డూరంగా ఉందని సుభాష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, అమ్మఒడి, ప్రత్యేక హోదా, సన్నబియ్యం, సీపీఎస్ రద్దు వంటి హామీల పరిస్థితి ఏమైందో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి ప్రజలు కేవలం 11 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ఘోర పరాభవం కల్పించారని గుర్తు చేశారు.

బీసీ రిజర్వేషన్లపై వైసీపీ మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి సుభాష్ అన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం గతంలో న్యాయపోరాటం జరిగిందని, అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గిపోయాయని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వేలాది బీసీ స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే వైసీపీ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

డీఎస్సీ విషయంలోనూ వైసీపీ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తోందని సుభాష్ ఆరోపించారు. డీఎస్సీని అడ్డుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించిన వైసీపీకి నిరుద్యోగుల భవిష్యత్తుపై మాట్లాడే హక్కు లేదన్నారు. కూటమి ప్రభుత్వం రానున్న కాలంలో మూడు డీఎస్సీలను విజయవంతంగా నిర్వహించి ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.

కొడాలి నాని ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. హద్దులు దాటి మాట్లాడితే తగిన రీతిలో రాజకీయంగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.