Vijayawada: కులం, మతంతో వైసీపీ స్వార్థ రాజకీయాలు: ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వజం!

Vijayawada: కులం, మతంతో వైసీపీ స్వార్థ రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 30 Aug 2026 7:09 PM IST
Vijayawada
X

Vijayawada: కులం, మతంతో వైసీపీ స్వార్థ రాజకీయాలు: ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వజం!

విజయవాడ: కులం, మతాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా.. అధికారం కోల్పోయిన తర్వాత మరో రకంగా మాట్లాడటం వైసీపీ నేతల నైజమని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకుల మాటలు వింటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని వ్యాఖ్యానించారు.

2019-24 మధ్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగాయని, ఆనాడు వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డే ఇప్పుడు బహిరంగంగా చెబుతున్నారని బోండా ఉమా పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మత మార్పిడులను ప్రోత్సహించామని అధికారికంగా చెప్పిన పరిస్థితి ఉందని ఆరోపించారు. ఒకవైపు మత మార్పిడులపై స్వయంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూనే.. మరోవైపు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

వైసీపీ హయాంలో హిందూ మతంపై కుట్రలు జరిగాయని బోండా ఉమా ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన తనకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించారని, అత్తవారి ఇంట్లో తనను మతం మార్చేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వైసీపీ నేతలపై ఉందన్నారు.

హిందూ దేవాలయాలు, మత సంప్రదాయాల గురించి వైసీపీ నేతలు మాట్లాడే ముందు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహానికి జరిగిన అవమానం, రథాల దహనం, అంతర్వేది రథం ఘటన, అమ్మవారి వెండి రథం చోరీ వంటి ఘటనలను ఆయన ప్రస్తావించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని బోండా ఉమా అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు, హుండీలకు సంబంధించిన అంశాల్లోనూ వైసీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. హిందూ ధర్మం, దేవాలయాల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను మరిచిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు.

కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమే వైసీపీ నాయకుల రాజకీయ విధానంగా మారిందని బోండా ఉమా ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం అన్ని కులాలు, అన్ని మతాలను సమానంగా చూస్తూ ప్రజలందరికీ సమానమైన పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. సమాజంలో ఐక్యతను కాపాడటంతో పాటు ప్రతి వర్గానికి న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

వైసీపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలను ఇప్పుడు సొంత పార్టీ నాయకులే బయటపెడుతున్నారని బోండా ఉమా అన్నారు. గతంలో తాము చేసిన పనులపై ఆ పార్టీ నేతలే ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం కులం, మతాన్ని ఉపయోగించుకోవడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు కాలం చెల్లిందని, అభివృద్ధి, సంక్షేమం, సమాన పాలనపైనే కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని బోండా ఉమా స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story