AP: డీఎస్సీపై వైసీపీది గోబెల్స్‌ ప్రచారం: భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి!

AP: మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు హిట్లర్, గోబెల్స్ తరహాలో అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 9 Sept 2026 8:54 PM IST
AP
X

AP: డీఎస్సీపై వైసీపీది గోబెల్స్‌ ప్రచారం: భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి!

AP: మెగా డీఎస్సీపై వైసీపీ హిట్లర్, గోబెల్స్ తరహాలో దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు, పక్కా లెక్కలతో సమాధానం ఇచ్చినా వైసీపీ నేతలు పదేపదే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మెరిట్‌తో డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులను వైసీపీ అనుకూల మీడియా వేధిస్తోందని ఆరోపించారు. కడప జిల్లాలో మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధించిన ఏడుగురు అభ్యర్థులను ‘నకిలీ టీచర్లు’గా చిత్రీకరించడం దారుణమన్నారు. నిబంధనల ప్రకారం టెట్‌ ఉత్తీర్ణులైన క్రీడాకారులకు ప్రతిభ ఆధారంగా నియామక పత్రాలు అందించారని స్పష్టం చేశారు.

శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో ఉద్యోగాలు పొందిన వారిపైనా వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. 2020 వరకు బలిజ కులస్తులకు బీసీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినప్పటికీ, 2022లో న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు ఓసీగా పరిగణించి వ్యవహరించారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్ల జారీకి విద్యాశాఖకు సంబంధం ఏమిటో తెలియకుండా ఆరోపణలు చేయడం వైసీపీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే రామకృష్ణకు ఉద్యోగం వచ్చిందన్న ప్రచారం కూడా అవాస్తవమని కొట్టిపారేశారు.

ఈ నెల 17న గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 వ్యవహారంపై హైకోర్టులో కీలక తీర్పు రానున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరుగుతున్న కేసులో ప్రభుత్వం సీబీఐ విచారణ ఎలా ఆదేశిస్తుందో తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను బహిరంగంగా చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే జగన్‌ తన ఒరిజినల్‌ డిగ్రీ సర్టిఫికెట్లను ప్రజల ముందు పెట్టాలని రాంగోపాల్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story